దేశ చరిత్రలోనే కాళేశ్వరం అతిపెద్ద స్కాం: మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

by Satheesh |   ( Updated:2023-12-19 13:57:53.0  )
దేశ చరిత్రలోనే కాళేశ్వరం అతిపెద్ద స్కాం: మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిందని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై గత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ఏడాది మార్చిలోనే కాగ్ నివేదిక అడిగిందన్నారు. దానికి సంబంధించిన లేఖను సైతం పంపిందని తెలిపారు. ప్రభుత్వ అవినీతి ఎక్కడ బయట పడుతుందోనని భయపడి రాష్ట్ర ప్రభుత్వం దాచి పెట్టిందని ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు పట్ల అనుమానాలు ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీ చేయాలని అమిత్ షా కు లేఖ రాశారని, మరి ఇప్పుడెందుకు కాళేశ్వరం అవినీతి పై విచారణకు లేఖ రాయట్లేదు అని ప్రశ్నించారు.

కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ కాదని, అది ప్రాజెక్ట్‌లో చిన్న భాగమేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పక్కన పెట్టేసి మేడిగడ్డ వరకే చర్చ సాగుతుందన్నారు. ప్రాజెక్ట్ కుంగినప్పుడు మేడిగడ్డ సందర్శనకు వెళ్లిన రాహుల్ గాంధీ కాళేశ్వరం సొమ్మును రికవరీ చేసి .. ప్రజల ఖాతాలో వేస్తామని చెప్పిన మాటేమిటి? అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్కాం వెనకాల మెఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఉందని, కానీ ఎల్అండ్ టీ వరకే కాళేశ్వరం స్కాం పరిమితం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మేఘ కంపెనీకి కర్ణాటకలో కొన్ని ప్రాజెక్ట్స్ దక్కాయన్నారు. అక్కడి ప్రభుత్వంలో ఉన్న ఓ ప్రజాప్రతినిధిని మెఘా పెద్దలు కలిసినట్టు సమాచారం అని, దీంతో మెఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం కలుగుతోందన్నారు.

కాళేశ్వరంపై హై కోర్ట్ జడ్జి విచారణ అనేది కేసును పక్క దారి పట్టించడానికి మాత్రమే అవుతుందని విమర్శించారు. జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. మెఘా కరప్షన్ మీద సీబీఐ విచారణకు ఆదేశించాలని రేవంత్ కేంద్రాన్ని కోరాలన్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కావాలంటే ఇస్తానన్నారు. ఇప్పటికే వారికి అన్ని ఆధారాలు పంపించానని, అవి వారికి చేరాయి అనే అనుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed