Minister Uttam Kumar: కాళేశ్వరం పూర్తి చేయాలంటే ఎన్ని కోట్లు కావాలో తెలుసా?.. కుండబద్దలు కొట్టిన మంత్రి ఉత్తమ్

by Gantepaka Srikanth |   ( Updated:2024-07-26 11:07:39.0  )
Minister Uttam Kumar: కాళేశ్వరం పూర్తి చేయాలంటే ఎన్ని కోట్లు కావాలో తెలుసా?.. కుండబద్దలు కొట్టిన మంత్రి ఉత్తమ్
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. తుమ్మిడిహట్టి దగ్గర వైఎస్ఆర్ కూడా శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. దానికే ప్రాణహిత చేవెళ్ల అని పేరు పెట్టారని.. పనులు కూడా మొదలయ్యాయని తెలిపారు. ఎక్కువ ఖర్చు అయితే, ఎక్కువ కమీషన్లు వస్తాయని బీఆర్ అంబేద్కర్ ప్రాజెక్ట్ పేరు మార్చి కాళేశ్వరం అని పెట్టారని వెల్లడించారు. అంతేకాదు.. ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.38 వేల కోట్ల నుంచి రూ.80 వేలకు పెంచారని అన్నారు. బీఆర్ఎస్ దిగిపోయే సరికి రూ.94 వేల కోట్లకు పెంచారని చెప్పారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును మొత్తం పూర్తి చేయాలంటే రూ.లక్షా 47 వేల కోట్లు కావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. గోదావరి నదిపై ప్రాజెక్టులు కట్టాలని ఆనాడే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు. అందులో భాగంగా వైఎస్ఆర్ తుమ్మిడిహట్టి దగ్గర శంకుస్థాపన చేశారని చెప్పుకొచ్చారు.

‘94 వేల కోట్లు ఖర్చు చేసి 93 వేళ ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ నేతలకు పిక్నిక్ స్పాట్‌గా మారింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ప్రాజెక్ట్ కుంగిపోయింది. ఇదే విషయమై నివేదిక ఇచ్చిన ఎన్డీఎస్ఏ‌ పై కూడా బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోయినప్పుడు కేసీఆర్ ఎందుకు నోరు మెదపలేదు. బ్యారేజ్‌లలో ఎవరూ 16 టీఎంసీల నీరు నిల్వ చేయరు. బ్యారేజ్‌లలో నీరు నిల్వ చేయొద్దు అని ఎన్డీఎస్ఏ‌ చెప్పింది. కాళేశ్వరం గేట్లు మూసేస్తే పెను ప్రమాదం పొంచి ఉంది. దిగువన ఉన్న ప్రాజెక్టులతో పాటు భద్రాచలం మునుగుతాయి. ఎల్లంపల్లిలో రేపటినుంచి పంపింగ్ మొదలు పెడతాం. అసలు నీళ్లు వదలాలని బీఆర్ఎస్ నేతలు తమకు ఇస్తున్న వార్నింగ్‌లను చూస్తుంటే నవ్వొస్తుంది’ అని మంత్రి ఉత్తమ్ ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed