ఆ స్థానంపై కేసీఆర్ ఫోకస్..! ఎంపీ బరిలో మహిళా నేత?

by Prasad Jukanti |
ఆ స్థానంపై కేసీఆర్ ఫోకస్..! ఎంపీ బరిలో మహిళా నేత?
X

దిశ, డైనమిక్ బ్యూరో:అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు రానున్న లోక్ సభ ఎన్నికలు సవాలుగా మారాయి. ఈ ఎన్నికల ద్వారా పార్టీ ప్రతిష్టను చాటుకునేందుకు గులాబీ బాస్ తీవ్ర కసరత్తే చేస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో రకరకాల స్ట్రాటజీలతో స్కెచ్ వేస్తున్న కేసీఆర్ చేవెళ్ల విషయంలో తాజాగా తన మనసు మార్చుకున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి స్థానంలో మాజీ మంత్రి, సబితా ఇంద్రారెడ్డిని బరిలోకి దింపే యోచనలో కేసీఆర్ ఉన్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

బీజేపీలోకి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి?

ఇటీవలే మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సతీమణి, వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో చేవెళ్లలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈసారి చేవెళ్ల ఎంపీగా కాంగ్రెస్ తరపున సునీతా మహేందర్ రెడ్డినే బరిలోకి దిగబోతున్నారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఇక బీజేపీ తరపున మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరు దాదాపు ఖరారు అయినట్లే అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చేవెళ్ల గడ్డపై నుంచి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కు ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు గెలిచి చూపించాలన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్నందున ఇక్కడ ఎంపీ స్థానం గెలిస్తే ఈ రెండు జిల్లాలలో సత్తా చాటినట్లుగా పార్టీలు భావిస్తుంటాయి. అయితే ఈసారి కూడా తానే బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తానని, తన అభ్యర్థిత్వానికి కేటీఆర్ సైతం ఓకే చెప్పారని ఇది వరకే రంజిత్ రెడ్డి తన అభ్యర్థిత్వంపై ప్రకటన చేసినా బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచన మరోలా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఆయనను తప్పించి జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన సబిత ఇంద్రారెడ్డిని బరిలోకి దింపడం ద్వారా ఈ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవచ్చని గులాబీ బాస్ లెక్కలు వేసుకుంటునట్లు చర్చించుకుంటున్నారు. అయితే ఇదే జరిగితే రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీ గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్:

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఎఫెక్టుతో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఓ వైపు పార్టీ నుంచి నేతలు వలస వెళ్లడం మరో వైపు కాంగ్రెస్, బీజేపీలు కార్నర్ చేస్తుండటం కేసీఆర్ కు ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెడుతోంది. దీంతో రాబోయే ఎంపీ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు సాధించకుంటే అది పార్టీ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అందువల్ల అభ్యర్థుల ఎంపిక విషయంలో అధినేత కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చెవెళ్ల సెగ్మెంట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ బాస్ రంజిత్ రెడ్డిని పక్కన పెట్టి సబితా ఇంద్రారెడ్డిని తెరపైకి తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేశ్వరం ఎమ్మెల్యేగా ఉన్న సబితా ఇంద్రారెడ్డిని ఎంపీ బరిలో దింపబోతున్నట్లు చర్చ సాగుతోంది. ఈ పరిణామాలతో రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి బీజేపీలోకి వెళ్తారా? వెళ్లినా అక్కడ కొండా విశ్వేశ్వర్ ఉన్నందునా టికెట్ దక్కుతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా లోక్ సభ ఎన్నికల్లో సైలెంట్ వ్యూహం రచిస్తున్న కేసీఆర్ ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి? వాటిలో ఏ మేరకు సఫలం అవుతాయనేది ఉత్కంఠగా మారింది.

Advertisement

Next Story