- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీటర్ల చీకటి ఒప్పందం బట్టబయలు.. అసెంబ్లీ వేదికగా గుట్టురట్టు చేసిన CM
దిశ, తెలంగాణ బ్యూరో : మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసినా తెలంగాణ లొంగలేదంటూ ఇప్పటివరకూ బీఆర్ఎస్ నేతలు చేసిన ప్రకటనల్లోని బండారాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా శనివారం బట్టబయలు చేశారు. ప్రధాని మోడీ, అప్పటి సీఎం కేసీఆర్ మధ్య కుదిరిన పరస్పర అవగాహన మేరకు 2017 జనవరి 4వ తేదీనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర సర్కార్, డిస్కంల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగిందని, కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇది బయటికు రాకుండా కేసీఆర్ జాగ్రత్త పడ్డారని సీఎం ఆరోపించారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ల దగ్గర మీటర్లు బిగించాలన్న కేంద్ర ప్రభుత్వ షరతులకు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయిందని, ఆరు నెలల్లోనే ఇది అమలులోకి రావాలంటూ అగ్రిమెంట్‌లో రాష్ట్ర ప్రభుత్వం సంతకం చేసి ఆమోదించిందని అప్పటి డాక్యుమెంట్‌ను అసెంబ్లీ ముందుంచారు.
మీటర్లు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని, ఒప్పందం చేసుకున్నదనే అంశం వెలుగులోకి వస్తే రైతులు ఉరి వేస్తారన్న ఉద్దేశంతోనే ఇది బయటికి పొక్కకుండా కేసీఆర్ జాగ్రత్త తీసుకున్నారని, కానీ కేంద్రంతో కొట్లాడినట్లు బీఆర్ఎస్ ప్రగల్బాలు పలికిందని సీఎం రేవంత్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చర్చల్లో పాల్గొన్న హరీశ్‌రావు విమర్శలు చేస్తున్న సమయంలో ఈ డాక్యుమెంట్‌ను సీఎం రేవంత్ బహిర్గతం చేయడం గమనార్హం. ఈ ఒప్పందం ప్రకారం 2017 జూన్ 30వ తేదీకల్లా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లకు మీటర్లు బిగిస్తామని, 2018 జూన్ 30లోగా ఫీడర్లకు మీటర్లు పెడతామని, 2018 డిసెంబర్ 31లోగా 500 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్తు వాడే వినియోగదారుల సర్వీస్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను బిగిస్తామని, 200 యూనిట్ల వరకు విద్యుత్తు వాడే వినియోగదారులకు 2019 డిసెంబర్ 31 లోపు మీటర్లు పెడతామని బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఒప్పందం ద్వారా సమ్మతించిందని రేవంత్ వివరించారు.
ఈ ఒప్పందంలోని షరతులను ప్రస్తావించడంతో పాటు వాటిని ఇప్పటివరకూ అమలు చేయని కారణంగా భవిష్యత్తులో తీసుకోబోయే చర్యల ప్రమాదాన్ని వివరించారు. ఈ ఒప్పందంలో పేర్కొన్న షరతులను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయకపోతే ఉల్లంఘనలకు పాల్పడిందనే కారణంతో రాష్ట్ర డిస్కంల మీద కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశముందని సీఎం హెచ్చరించారు. తెలంగాణ డిస్కంల మెడ మీద ఇప్పుడు కత్తి వేలాడుతున్నదన్నారు. గత ప్రభుత్వం ఆనాడు కుదుర్చుకున్న దుర్మార్గపు ఒప్పందం ఇప్పుడు తెలంగాణకు గుదిబండగా మారిందన్నారు. మోడీతో ప్రేమలో ఉన్న కేసీఆర్ ఆనాడు సంతకాలు పెడుతున్నప్పుడు తెలంగాణ ప్రయోజనాలు కనిపించలేదా అని సీఎం ప్రశ్నించారు.
ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణ విద్యుత్తు శాఖను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పి ఈ రోజు విధిలేని పరిస్థితిని తెలంగాణ డిస్కంలకు తెచ్చి పెట్టింది గత ప్రభుత్వమేనని ఆరోపించారు. ఆనాడు ఒప్పందాలు చేసుకున్న లీడర్లే ఇప్పుడు అబద్ధాలాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీశ్‌రావును ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. గతంలో చేసిన పాపాలకు తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ లీడర్లు ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా తాము ఇప్పుడు ఈ వాస్తవాలను బయటపెట్టామని, నిజాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ‘ఉదయ్’ ఒప్పందంపై సంతకాలు పెట్టనేలేదని, మీటర్లు పెట్టబోమని కేంద్రానికి చెప్పామని, ఎంతగా ఒత్తిడి చేసినా లొంగకుండా రాష్ట్ర రైతాంగం కోసం కొట్లాడామని... ఇలా బీఆర్ఎస్ లీడర్లు చెప్పిన ఊకదంపుడు మాటలన్నీ అబద్ధాలేనని సీఎం స్పష్టం చేశారు.
ఈ ఒప్పందంపై అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అజయ్ మిశ్రా, దక్షిణ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి, ఉత్తర డిస్కం సీఎండీ గోపాల్ రావు సంతకాలు పెట్టారని, కేంద్ర ప్రభుత్వం తరఫున విద్యుత్ మంత్రిత్వశాఖ డిస్ట్రిబ్యూషన్ విభాగం జాయింట్ సెక్రటరీ అరుణ్ కుమార్ వర్మ సంతకాలు చేశారని సీఎం వివరించారు. వీరంతా కలిసి చేసిన దుర్మార్గం కారణంగా ఇప్పుడు తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిన గత్యంతరం లేని పరిస్థితి తలెత్తిందన్నారు. ఈ డాక్యుమెంట్‌ను బయటపెట్టినా హరీశ్‌రావు ఇంకా అబద్ధాలతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఖుల్లం ఖుల్లాగా డాక్యుమెంటులోని వివరాలను బైటపెట్టినా ప్రజలను, ఎమ్మెల్యేలను, సభను తప్పుదారి పట్టించే తీరులో హరీశ్‌రావు వ్యవహరిస్తున్నారని, ఆయన మాటలన్నీ అసత్యాలైనందున ఆ మాటలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌కు సభానాయకుడిగా సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.
హరీశ్ తన రాజకీయ అనుభవాన్ని రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా అబద్ధాలతో ప్రజలను డైవర్ట్ చేసేందుకు వినియోగించడాన్ని మానుకోవాలని హితవు పలికారు. మోటార్లకు మీటర్లు పెట్టడాన్ని వ్యతిరేకించామంటూ హరీశ్‌రావు చెప్తూ రైతులను మభ్య పెడుతున్నారని, వాస్తవానికి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ల దగ్గర రైతుల మోటారు పంపు సెట్లు ఉండవని సీఎం వివరించారు. అప్పటి విద్యుత్ మంత్రి కూడా ఇదే సభలో ఉన్నా సైలెంట్‌గా ఉండిపోయారని, వాస్తవాలను సభ దృష్టికి తేవడంలేదన్నారు. ఒప్పందంపై సంతకాలు నిజమో కాదో ఇప్పటికైనా వాస్తవాన్ని ప్రజలకు హరీశ్‌రావు వివరిస్తే భవిష్యత్తులో ఒకటీ అరా సీట్లయినా బీఆర్ఎస్‌కు దక్కుతాయని ఎద్దేవా చేశారు.