ఫిరాయింపులతో దిక్కుతోచని స్థితిలో కేసీఆర్!.. నెక్ట్స్ ఎవరు..?

by Ramesh Goud |
ఫిరాయింపులతో దిక్కుతోచని స్థితిలో కేసీఆర్!.. నెక్ట్స్ ఎవరు..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి, పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా స్థానాలతో డీలా పడిపోయి ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సొంత పార్టీ నేతలే షాక్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలు, 7 మంది ఎమ్మెల్సీలు, పార్టీలోని కీలక నేతలు బీఆర్ఎస్ ను వీడి హస్తం గూటికి చేరుకోగా.. తాజాగా మరో ఎమ్మె్ల్యే సైతం వీరి బాటలోనే వెళ్లారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఇవ్వాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఆయన సీఎం సమక్షంలో పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు కార్పొరేటర్లు, అనుచరులు సైతం పార్టీలో జాయిన్ అయ్యారు. వీరిలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రాఘునాధ్ రెడ్డి, హైదరాబాద్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ ఉన్నారు. దీంతో ఇప్పటివరకు కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9 కి చేరింది.

నెక్ట్స్ ఎవరు..?

కాగా బీఆర్ఎస్ పార్టీలో ముగ్గురు నలుగురు తప్ప మిగతా అందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని, రేవంత్ రెడ్డి త్వరలో మరో సిక్స్ కొట్టబోతున్నాడని కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ సిక్స్ లో గంటల వ్యవధిలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు జాయిన్ అవ్వగా.. తదుపరి పార్టీలోకి చేరబోయే ఎమ్మెల్యే ఎవరా..? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో గులాభీ బాస్ గుండెల్లో గుబులు మొదలైంది. మరికొద్ది రోజుల్లో జరగబోయే స్థానిక సంస్థల్లో అయినా సత్తా చాటి పార్టీ క్యాడర్ ను కాపాడుకోవాలని అనుకున్న కేసీఆర్ కు ఫిరాయింపులు పెద్ద సమస్యగా మారింది. ఫామ్ హౌజ్ కి పిలిచి చెప్పినా పార్టీ నేతలు మాట వినకుండా బీఆర్ఎస్ ను వీడుతుండటంతో బీఆర్ఎస్ అధినేత దిక్కు తోచని స్థితిలో ఉన్నారని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఫిరాయింపులు ఇలాగే కొనసాగితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి కష్టంగా మారే అవకాశం ఉందని పార్టీ క్యాడర్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.



Next Story