Aadi Srinivas : బీసీలపైన కవిత కపట ప్రేమ : ఆది శ్రీనివాస్

by Y. Venkata Narasimha Reddy |
Aadi Srinivas : బీసీలపైన కవిత కపట ప్రేమ : ఆది శ్రీనివాస్
X

దిశ, వెబ్ డెస్క్ : బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha)తెగ హడావిడి చేస్తున్నారని.. అసలు బీసీలతో కవితకు ఏం సంబంధమని ? ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Aadi Srinivas)ప్రశ్నించారు.బీసీలపైన మొసలి కన్నీరు, కపట ప్రేమ(Hypocritical love)ను కవిత చూపిస్తున్నారని, అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బీసీలకు చేసిందేముందని నిలదీశారు. బీసీల గురించి ఆమె పోరాడాల్సిన అవసరం ఏముందని, బీసీలు తమ హక్కులు, రిజర్వేషన్ల సాధన కోసం పోరాడే పటిమ బీసీ నాయకులకు ఉందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఏనాడైనా కవిత మాట్లాడారా? అని శ్రీనివాస్ నిలదీశారు. గిరిజనులు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్.. అప్పుడు బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదని విమర్శించారు. బీసీ కార్పోరేషన్ సహా అన్ని కార్పోరేషన్లను నిర్వీర్యం చేసి, ఎంబీసీ ఏర్పాటు చేసి రూపాయి కేటాయించలేదన్నారు. ఎన్నికల ముందు బీసీల ఓట్ల కోసం బీసీ బంధు డ్రామా వేశారన్నారు.

కేసీఆర్ హయాంలో బీసీల రిజర్వేషన్ల పెంపుకు కనీసం ప్రయత్నం చేయలేదన్నారు. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలను మాయం చేశారని విమర్శించారు. బీసీల లెక్కలు తేల్చేందుకు రాహుల్ గాంధీ సూచనలతో మా సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేపట్టారన్నారు. దేశానికి కులగణనలో తెలంగాణ రోల్ మోడల్‌గా మారిందని, సర్వేలో మీ నాయకులు పాల్గొనలేదన్నారు. బీసీల కోసం జనవరి 3వ తేదీన మహాసభ ఏర్పాటు చేస్తామంటున్నారని, కల్వకుంట్ల కవిత నాయకత్వం మా బీసీల పోరాటాలకు అవసరం లేదన్నారు. మా సమస్యలు మేం పరిష్కరించుకునే శక్తి మా బీసీలకు ఉందన్నారు.

కేవలం లిక్కర్ కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్లీంచేందుకే కవిత బీసీ ఉద్యమాలతో నాటకాలు వేస్తుందన్నారు. గతంలోనూ ఆమె వచ్చాకే బతుకమ్మ వచ్చినట్లుగా ప్రజలను మభ్యపెట్టిన సంగతి మరువరాదన్నారు. కొంతమంది బీసీ నాయకులను పక్కన పెట్టుకుని బీసీ జపం చేసినంత మాత్రాన కవిత నాయకత్వంలో బీసీ ఉద్యమాల్లో ఏ బీసీలు పాల్గొనబోరన్నారని, అంత కర్మ మా బీసీలకు పట్టలేదన్నారు.

కుల గణన లెక్కలు తేలాకా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు చేయాల్సిన న్యాయం చేస్తారన్నారు. మా చిత్తశుద్ధిని మీరు శంకించాల్సిన అవసరం లేదన్నారు. కుల గణన వివరాల మధింపు జరుగుతుందని, 42శాతం రిజర్వేషన్ కల్పించే విషయమై కసరత్తు కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో కుల గణన విజయవంతం చేసిన కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా జనగణన తో పాటు కులగణనను కూడా డిమాండ్ చేస్తుందన్నారు. బెల్గామ్ సీడబ్ల్యుసీ సమావేశాల్లోనూ సీఎం రేవంత్ దీనిపై ప్రతిపాదనలు చేశారని గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed