కరీంనగర్ డెయిరీని కూల్చేదెన్నడు..? ఎమ్మెల్యే ఆదేశించినా చర్యలు శూన్యం

by Shiva |
కరీంనగర్ డెయిరీని కూల్చేదెన్నడు..? ఎమ్మెల్యే ఆదేశించినా చర్యలు శూన్యం
X

దిశ, గన్నేరువరం: మండల కేంద్రంలోని గుండ్లపల్లి‌దేవుడి చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో 20 గుంటల భూమిని ఆక్రమించి నిర్మించిన కరీంనగర్ డెయిరీని ఎప్పుడు కూల్చేస్తారని మండల ప్రజలకు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ‘దిశ’ దిన పత్రికలో చెరువులో నిర్మించిన కరీంనగర్ డెయిరీ పాల కేంద్రం కథనానికి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ తక్షణమే స్పందించి చెరువులో నిర్మించిన పాల కేంద్రాన్ని వెంటనే కూల్చివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ‌కిరణ్ చెరువులో నిర్మించిన పాల కేంద్రాన్ని కూడా పరిశీలించారు.

ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను సర్వే నిర్వహించి రిపోర్టు అందజేయాలని ఆదేశాలు జారీ చేయగా వారు రిపోర్ట్ అందజేసి వారాలు గుడుస్తున్నాయి. చివరికి ఎమ్మెల్యే ఆదేశించినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల చిత్తశుద్ధిపై ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ అప్పటి అధికారులను, సర్పంచ్లను డైయిరీ యజమాని ప్రలోభాలకు గురిచేసి తక్కువ పరిమాణంలో దొంగ అనుమతులు తీసుకుని 20 గుంటల భూమిని కబ్జా చేశారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. అప్పటి గ్రామ పంచాయతీ సెక్రెటరీ, మండల రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మానకొండూరులో హైడ్రా అవసరమా..

ఒక వైపు చెరువును ఆక్రమించి నిర్మించిన డైయిరీపై ఎలాంటి చర్యలు తీసుకోలేని అధికారుల చిత్తశుద్ధిని ప్రజలు శంకిస్తున్నారు. మరోవైపు చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైడ్రా’ మానకొండూరు మండలానికి అవసరమా అని టెలికాలర్లు నియోజకవర్గ ప్రజలకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఉన్న ఆక్రమణలు తొలగించకపోగా ప్రజాభిప్రాయ సేకరణ చేయడం విడ్డూరంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. తొలిసారిగా అధికారుల దృష్టికి వచ్చిన కరీంనగర్ డైయిరీని తొలగించడంతో పాటు నియోజకవర్గంలో ఆక్రమణకు గురైన ప్రతి చెరువును పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు. గుండ్లపల్లి దేవునిచెరువులో ఆక్రమించి నిర్మించిన కట్టడాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story