ఈ ఎన్నికల్లో కార్పొరేట్ ధనవంతుడికి... సింగరేణి కార్మికుడికి మధ్య పోటీ...

by Sridhar Babu |   ( Updated:2024-04-20 14:51:40.0  )
ఈ ఎన్నికల్లో కార్పొరేట్ ధనవంతుడికి... సింగరేణి కార్మికుడికి మధ్య పోటీ...
X

దిశ, గోదావరిఖని : కార్పొరేట్ ధనవంతుడి ధన దాహానికి ... సామాన్య సింగరేణి కార్మికుడికి మధ్య పోటీ జరుగుతుందని మాజీ మంత్రి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం గొల్లపల్లి మండలం శ్రీరాముల పల్లె, రాపల్లి, వెనుగుమట్ల, బొంకూర్ లోత్తునూర్ గ్రామాలలో ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, పెద్దపల్లి పార్లమెంటరీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సాధ్యం కానీ హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.

బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం రైతు బంధుతో పాటు మరెన్నో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. అలాగే రైతులకు వారి ఖాతాలో రైతు బంధును జమచేయాలని డిమాండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీకి వెళ్లి ఆపించారని విమర్శించారు. అసలు రైతులకు రైతు బంధు ఎప్పుడు వేస్తారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 4 వేల పింఛన్​ వస్తుందని చెప్పి ప్రజలను వంచన చేసిందని ఆరోపించారు. ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలను ఒప్పుకున్నట్లే అవుతుందని ఎద్దేవా చేశారు.

మళ్లీ తెలంగాణ అస్తిత్వం బాగుండాలంటే మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ కారుడు కేసీఆర్ ఉండాలని ప్రజలకు తెలిపారు. ఈసారి ఎంపీ అభ్యర్థిగా అవకాశం వచ్చిందని తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ నుండి 100 కంపెనీలు, వేల కోట్లతో ఓ ధనవంతుడు అభ్యర్థిగా వస్తున్నాడని..వాళ్లు గెలిస్తే ప్రజల మధ్య ఉండరని హైదరాబాద్ లోని కార్పొరేట్ సంస్థల మధ్యలో ఉంటారని విమర్శించారు. కానీ కొప్పుల ఈశ్వర్ అనే తాను స్థానికుడనని, మీకు అందుబాటులో ఉండే నాయకుడని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం కొప్పుల ఈశ్వర్ పుట్టినరోజు సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story