కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి

by Sridhar Babu |
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
X

దిశ, గోదావరిఖని : మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందు కార్మికులు దీక్ష చేపట్టారు. బుధవారం దీక్ష కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు. కార్మికులు ఉదయం 5 గంటల నుంచి కార్యాలయం ముందు నిరసన దీక్షకు దిగారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, బీఆర్ఎస్ అనుబంధ మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు మురళీధర్ రావు దీక్షను ప్రారంభించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచుతామని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు.

కానీ సంవత్సరం గడుస్తున్నా నెరవేర్చలేదన్నారు. నెలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా 11వ పీఆర్సీ ప్రకారం కేటగిరీల ఆధారంగా నెలకు 19వేల రూపాయల నుండి 30, 040 రూపాయల వరకు వేతనం నిర్ణయించారని అన్నారు. అదికూడా అమలుకు నోచుకోవడం లేదని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అమలు చేయడం లేదని పేర్కొన్నారు. కార్మికులకు సంవత్సరానికి 15 సెలవులు ఇవ్వాల్సి ఉండగా అవి కూడా ఇవ్వడం లేదని అన్నారు. దీంతోపాటు కార్మికులకు రక్షణ పరికరాలు కానీ, చీపుర్లు, బెల్లం ఇవ్వడం లేదన్నారు. అనంతరం రామగుండం ఇన్చార్జి కమిషనర్ అరుణశ్రీ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వి.నాగమణి, కిషన్ నాయక్, రాధాకృష్ణ, ఈ.రాజమల్లు, శేఖర్, సంతోష్, శోభన్, సారయ్య, స్వరూప, సునీత, శారద, రాణి, అంజయ్య, రూప, పద్మ, లత, రాజేందర్, మల్లమ్మ, రవి, చంద్రయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story