- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్‌చార్జ్‌లు వచ్చేశారు..!
దిశ, పెద్దపల్లి : వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్‌తో సర్కార్‌ను ఏర్పాటు చేయడానికి కసరత్తు ప్రారంభించింది. గ్రౌండ్ లెవల్లో ఉన్న సమస్యలను గుర్తించడంతో పాటు ఆత్మీయ సమ్మేళనాలతో బీఆర్ఎస్ నేతల మధ్య ఉన్న విభేదాలను తగ్గించి.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించింది. ఏప్రిల్ 2 నుంచి జూన్ 2 వరకు వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మధ్య ఉంటూ గ్రామ స్థాయిలో అన్ని కమిటీలను ఏర్పాటు చేసుకొని వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయించింది. పార్టీ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఇంచార్జులు ఆత్మీయ సమ్మేళనాలతో ముందుకు సాగుతూ పార్టీ యాక్షన్ ప్లాన్ అమలు చేసే పనిలో పడ్డారు.
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తుంది. ఎన్నికలకు ముందే గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతి జిల్లాకు ఒక్కరిని బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీగా నియమించింది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు బస్వరాజు సారయ్యను ఇంచార్జీగా నియమించగా పెద్దపల్లి జిల్లాకు ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను జగిత్యాల జిల్లాకు కోలేటి దామోదర్‌ను నియమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని పటిష్టం చేయడానికి ముగ్గురు ఇంచార్జులు రంగంలోకి దిగారు.
పెద్దపల్లి జిల్లా ఇంచార్జీగా ఉన్న ఎర్రోళ్ల శ్రీనివాస్ ఈనెల 17వ తేదీన పెద్దపల్లి జిల్లాకు చెందిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధులతో పాటు ఎంపీపీలు, జెడ్పీటీసీలతో పాటు గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. జగిత్యాల జిల్లా ఆత్మీయ సమ్మేళనం ఈనెల 19వ తేదీన నిర్వహిస్తుండగా కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం ఈనెల 21న నిర్వహిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన సమావేశం డేట్ ఫిక్స్ కాలేదు.
సర్వే ఫలితాల ఆధారంగానే ఇంచార్జులు..?
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ కొన్ని చోట్ల స్వల్ప మెజార్టీతో గెలుస్తుందని, కొన్ని నియోజకవర్గాల్లో తక్కువ మెజార్టీతో ఓటమి చెందుతుందని ఇటీవల నిర్వహించిన సర్వేల ఫలితాలు వచ్చినట్లు సమాచారం. సర్వే ఫలితాల ఆధారంగానే ఇంచార్జులను నియమించి లోపాలను సవరించుకుంటే మళ్లీ విజయం సాధిస్తామనే భావనతో ప్రతి జిల్లాకు ఒక ఇంచార్జీని నియమించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లీడర్ల మధ్య ఉన్న విభేదాలు సైతం తారస్థాయిలోకి పెరిగిపోయాయి. వాటిని గుర్తించి సమన్వయం చేయాలని లేకుంటే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని భావించి ఇంచార్జుల నియామకం చేశారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.
ఏప్రిల్ టు జూన్ వరకు కార్యక్రమాలు..
జిల్లాలకు ఇంచార్జీలుగా వచ్చిన వారితో పాటు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం సైతం నిత్యం ప్రజల మధ్య ఉండే విధంగా యాక్షన్ ప్లాన్ చేపట్టింది. మొదట జిల్లా స్థాయిలో ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ఏప్రిల్ 2వ నుంచి జూన్ 2 వరకు ప్రజల్లోనే ఉండే విధంగా ప్లాన్ చేశారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఏప్రిల్13వ తేదీ వరకు 10 గ్రామాలకు కలిపి ఒక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలు వివరించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 14వ తేదిన అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ప్రారంభిస్తున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
ఏప్రిల్ 25వ తేదీ నాటికి అన్ని గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ 27వ తేదీన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ 30వ తేదీన తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు.
ప్రపంచ కార్మికుల దినోత్సవం ‘మే’ డేను కార్మికుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం తో పాటు జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను సైతం ఘనంగా నిర్వహించే ఇంచార్జుల ద్వారా బీఆర్ఎస్ పార్టీ పక్కా ప్లాన్ చేసింది. ఇంచార్జులు వారికి అప్పగించిన పనిని సక్రమంగా నిర్వహించి ముందుకు సాగుతారా.. పార్టీ ఇంచార్జుల కంటే సీనియర్లుగా ఉన్న మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు.. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వీరిని కలుపుకొని ఎలా ముందుకు సాగుతారో వేచి చూడాలి.