ఇళ్లు ఖాళీ చేయండి.. నిర్వాసిత గ్రామంలో సింగరేణి అధికారులు ఒత్తిళ్లు

by Sathputhe Rajesh |
ఇళ్లు ఖాళీ చేయండి.. నిర్వాసిత గ్రామంలో సింగరేణి అధికారులు ఒత్తిళ్లు
X

దిశ, రామగిరి: సింగరేణి నిర్వాసిత గ్రామం లద్నాపూర్ కు సెంటినరీ కాలనీలోని ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ప్లాట్ల కేటాయింపు జరగకుండానే ఇండ్లు ఖాళీ చేయాలంటూ సింగరేణి అధికారులు ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు. పునరావాస కేంద్రంలో రోడ్లు, డ్రైనేజీ పనులు నేటికీ కొనసాగుతునే ఉన్నాయి. ప్లాట్లలో పనులు పూర్తి కాకుండా, కేటాయింపు జరగకుండా ఇండ్లు ఎలా ఖాళీ చేస్తామంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామగుండం 3 ఏరియా ఓసీపీ2 విస్తరణలో భాగంగా సింగరేణి లద్నాపూర్ గ్రామాన్ని సింగరేణి యాజమాన్యం సేకరించింది. ఓసీపీ2 విస్తరణలో భాగంగా గ్రామంలోని రోడ్డుకు ఒక వైపున్న 137 ఇండ్లను ఖాళీ చేయించాలని నిర్ణయించింది. ఇదే విషయమై జనవరిలో సెంటినరీ కాలనీలో అదనపు కలెక్టర్, ఆర్డీవో ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫిబ్రవరి 15వ తేదీ వరకు ప్లాట్లలో పనులు పూర్తి చేసి అందజేస్తామని తెలిపారు. ఇప్పటివరకు పనులు పూర్తి కాలేదు. గ్రామస్తులకు రావాల్సిన నష్ట పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పూర్తి స్థాయిలో అందలేదు. వాటి గురించి అధికారులను ప్రశ్నిస్తే ఏదో సమాధానం చెప్తూ దాటవేసే ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఇండ్లు ఖాళీ చేయకముందే సింగరేణి అధికారులు ఇండ్ల మధ్య నుండి భారీ మెషీన్ల ద్వారా కందకం తవ్వకాలు చేపట్టి గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇండ్ల మధ్య నుండే తవ్వకాలు చేపట్టడంతో గ్రామస్తులు ఇబ్బందులు తీవ్ర ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ‌సింగరేణి అధికారులు నిత్యం ఏదో ఎంక్వైరీ పేరుతో గ్రామం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండడంతో అసలు ఏం జరుగుతుందో తెలియక గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. సింగరేణి సంస్థ పునరావాస కేంద్రంలో పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అందరికి ప్యాకేజీ రావాలి-పొట్ల శ్రీనివాస్, వార్డ్ మెంబర్ (లద్నాపూర్ గ్రామస్తుడు)

గ్రామంలో ఇంకా కొందరికి ప్యాకేజీ అందలేదు. ౧౮ సంవత్సరాలు నిండిన వారికి ఈ మధ్య ప్యాకేజీ లిస్ట్ ప్రకటించారు. అందులో కొందరి పేర్లు రాలేదు. అందరి పేర్లు లిస్ట్ లో వచ్చి ప్యాకేజీ అందజేయాలి.

పరిహారం, ప్లాట్ల పూర్తి అయ్యాకే పనులు కొనసాగించాలి-బడికెల విజయ, లద్నాపూర్ సర్పంచ్

లద్నాపూర్ గ్రామానికి సెంటినరీ కాలనీలో కేటాయించిన పునరావాస కేంద్రంలో పూర్తి స్థాయిలో పనులు పూర్తి కావాలి. గ్రామాన్ని తరలించిన తర్వాతే లద్నాపూర్ లో పనులు కొనసాగించాలి. అప్పటివరకు పనులను అడ్డుకుంటాం

రోడ్ల, డ్రైనేజీ నిర్మాణంలో నాణ్యత లోపం- మేడగోని ఉమ, ఎంపీటీసీ

సింగరేణి యాజమాన్యం పునరావాస కేంద్రంలో నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదు. ఈ మధ్యే వేసిన రోడ్లపై పగుళ్లు ఏర్పడ్డాయి. సింగరేణి అధికారులు ఇప్పటికైనా పగుళ్లు ఏర్పడిన రోడ్లను తొలగించి నాణ్యతతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాలి

Advertisement

Next Story