భగీరథ నీళ్లు ఎటుపాయే.. నీటి సరఫరాలో అధికారుల నిర్లక్ష్యం..

by Sumithra |   ( Updated:2023-04-02 10:18:33.0  )
భగీరథ నీళ్లు ఎటుపాయే.. నీటి సరఫరాలో అధికారుల నిర్లక్ష్యం..
X

దిశ, మల్లాపూర్ : రాష్ట్రంలో ప్రతిఇంటికి త్రాగునీరు సరఫరా కోసం కోట్ల రూపాయలను ఖర్చుచేసి పనులు చేస్తే అధికారుల నిర్లక్ష్యంతో నీటి సరఫరా మాత్రం జరగడం లేదు. త్రాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారు. వీటి ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేకుండా పోతున్నాయి. మండలంలోని అన్ని గ్రామాలలో భగీరథ నీళ్లు సరఫరా అడపాదడపా వస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో మండలంలోని ప్రజలు నీళ్ళ కోసం తిప్పలు తప్పడం లేదు. అన్ని గ్రామాలలో రెండు నుండి మూడు వాటర్ ట్యాంక్ లు ఉండగా వాటి అన్నిటికీ నీళ్లు సరఫరా కావడం లేదు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఈ విషయం పై అధికారుల వివరణకోరగా మండలానికి మూడు పంపుల ద్వారా నీటిసరఫరా అవుతుందని, అవి రిపేర్ లో ఉన్నాయని రెండురోజుల్లో బాగవుతాయని తెలిపారు.

సమావేశాల్లో చర్చించిన స్పందన లేదు..

తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేస్తున్నారు. లక్ష్యం మంచిదే అయినా నిర్వహణలోపం ప్రధాన సమస్యగా మారింది. క్షేత్రస్థాయిలో లోపాలను సరిచేయాలని మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు మొత్తుకుంటున్న ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది.

వారంలో ఎన్ని రోజులు నీళ్ళ సరఫరా..?

మండలంలో వారం రోజులలో రెండు లేదా మూడురోజుల్లో మాత్రమే నీటి సరఫరా అవుతుందని, మిగితా రోజుల్లో రావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీరు సరఫరా చేయాలని మండల ప్రజలు కోరుచున్నారు.

Advertisement
Next Story

Most Viewed