మైనర్లే ట్రాక్టర్ డ్రైవర్లు?.. ప్రమాదాలు జరిగితే బాధ్యులెవరు?

by Javid Pasha |
మైనర్లే ట్రాక్టర్ డ్రైవర్లు?.. ప్రమాదాలు జరిగితే బాధ్యులెవరు?
X

దిశ, రాజన్నసిరిసిల్ల ప్రతినిధి : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రోడ్డు రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారా అనే సందేహం కలుగుతోంది. మైనర్లు రోడ్లపై అధిక స్పీడుతో ట్రాక్టర్లు నడుపుతున్నా చూసీచూడనట్లుగా ఆయా శాఖల అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో నిత్యం ఎదో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయి. కళ్ల ముందే ఎన్ని ప్రమాదాలు జరిగినా పట్టించుకోరా..? తనిఖీలు చేస్తే మైనర్లు పట్టుబడరా ? అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. మైనర్లు ట్రాక్టర్లు నడపడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని పలువురు ప్రశ్నిస్తున్నారు.

గతంలో మారుపాక గ్రామానికి చెందిన దీక్షిత్ శ్రీ పెరుగు ప్యాకెట్ కోసం దుకాణానికి వచ్చింది. కాగా, ఓ బాలుడు ట్రాక్టర్ అతివేగంతో నడుపుతూ నిర్లక్ష్యంగా ఆ అమ్మాయిని ఢీకొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. కాగా, పక్కనే ఉన్న ఇంటి గోడకు తగిలి ట్రాక్టర్ ఆగింది. మరో అమ్మాయి తృటిలో తప్పించుకుంది. మైనరే ట్రాక్టర్ నడుపుతూ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణం బలి తీసుకున్నాడు. ఈ ఘటనలో కొనరావుపేట మండలంలోని పల్లిమక్త గ్రామానికి చెందిన ట్రాక్టర్ అదే గ్రామానికి చెందిన బాలుడు. జిల్లాలో అధికంగా మైనర్లే ట్రాక్టర్ డ్రైవర్లుగా వాహనాలు నడుపుతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అధిక సంఖ్యలో మైనర్లే ట్రాక్టర్లు నడుపుతుండడం గమనార్హం. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వారంలో మూడు, నాలుగు రోజులు ఇసుక పర్మిషన్ ఇస్తారు.

జిల్లా కేంద్రం సిరిసిల్లలో అధిక స్పీడుతో నడపడం రోడ్డు భద్రత, డ్రైవింగ్ పై అవగాహన లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి వారిని ప్రోత్సహిస్తే స్థానికుల ప్రాణాలకే ప్రమాదమని స్థానికులు వాపోతున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ వాగు నుంచి వారంలో రెండు రోజులు ఇసుక పర్మిట్లు ఇస్తారు. ఇసుక ట్రాక్టర్లు నడిపే వారు మైనర్లా..? మేజర్లా..? అని చూడడం లేదు. ఇది చూడాల్సిన ఆర్టీఏ అధికారులు ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాలపై దృష్టి సారించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మైనర్లు ఇసుక ట్రాక్టర్లు నడపకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదాలు జరగక ముందే జిల్లావ్యాప్తంగా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి కట్టడి చేయాలని కోరారు.

Advertisement

Next Story