- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రభుత్వ ఆస్పత్రిలో బ్లడ్ దందా..

దిశ బ్యూరో, కరీంనగర్ : ఆపద సమయంలో ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ అక్కడి సిబ్బందికి ఆదాయాన్ని సమకూర్చే వనరుగా మారింది. ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తుంటే ఆ రక్తాన్ని భద్రపరచి ఆపదలో ఉండి రక్తం అత్యవసరం ఉన్నవారికి అందించాల్సిన సిబ్బంది ఆ రక్తాన్ని బహిరంగంగా విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. కట్టడి చేయాల్సిన అధికారులను కరెన్సీ నోట్లతో కట్టిపడేయడంతో అక్రమ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. కరీంనగర్ సివిల్ ఆస్పత్రిలో ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సూత్రధారిగా ప్రభుత్వ ఆసుపత్రి ముందు బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేసి ప్రభుత్వ బ్లడ్ బ్యాంకు నుంచి రక్తాన్ని తరలిస్తూ విచ్చలవిడిగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రయివేటు బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులను కట్టడి చేయాల్సిన అధికారులు మాముళ్ల మత్తులో పట్టించుకోకపోవడంతో ఈ దందా గత కొంతకాలంగా యథేచ్ఛగా సాగుతుందనే విమర్శలు వెల్లువెత్తితున్నాయి.
సిబ్బందే సూత్రధారులుగా విక్రయాలు..
ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలు ఆపదలో ఉన్నవారికి రక్తం కొరత ఏర్పడకుండా ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రులలో బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేసింది. బ్లడ్ బ్యాంకు నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగులను నియమించి బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తుంది. అయితే అధికారుల పర్యవేక్షణ లోపంతో సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ బ్లడ్ బ్యాంకును ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పలు సందర్బాల్లో దాతల ద్వారా సేకరించిన రక్తాన్ని పేదలకు అందించాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా ప్రయివేటు బ్లడ్ బ్యాంకుల ద్వారా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అందుకు ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ప్రత్యేకంగా ఓ ప్రయివేటు బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగిస్తున్నారంటే వీరి అక్రమ దందా ఆ స్థాయిలో సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రయివేటు బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులను కట్టడి చేయాల్సిన అధికారులు వారిచ్చే కరెన్సీ నోట్లకు కక్కుర్తి పడి కళ్లున్నాకబోదుల్లా వ్యవహరించడంతో ఈ దందా గత కొంతకాలంగా యథేచ్ఛగా సాగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆధారాలతో ఫిర్యాదు చేసినా తూతూ మంత్రంగా చర్యలు..
అక్రమ దందా సాగిస్తున్న బ్లడ్ బ్యాంకు పై ఓ సామాజిక కార్యకర్త ఆధారాలతో ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సదరు అధికారి తూతూ మంత్రంగా విచారణ చేసి చేతులు దులుపుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆధారాలను పరిగణలకు తీసుకుని బ్లడ్ బ్యాంకు పై చట్టపర చర్యలు తీసుకోవాల్సిన అధికారి ఫొటోలకు ఫోజులు ఇచ్చి దొడ్డి దారిన జరుగుతున్న అక్రమ దందాను అరికట్టకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలను కట్టడి చేయాల్సిన అధికారులు డబ్బులకు కక్కుర్తి పడుతున్నారన్న విమర్శలున్నాయి. అక్రమ దందా కోసం ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేసుకుని బ్లడ్ అక్రమ దందా సాగిస్తూ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. అందు కోసం ప్రయివేటు బ్లడ్ బ్యాంకు నిర్వాహకుడినే ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా నియమించడం అక్రమ బ్లడ్ దందాలో అధికారుల పాత్రకు అద్దం పడుతుంది. ఇక్కడ ప్రైవేటు రక్తనిధి కేంద్రాలు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి. విచ్చలవిడిగా రక్తదాన శిబిరాలు నిర్వహించి, దాతల నుంచి వచ్చిన రక్తాన్ని అమ్ముకుంటున్నాయి. నిబంధనల ప్రకారం ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులకు ఇవాల్సిన రక్తం యూనిట్లను ఇవ్వకుండా ఎగనామం పెడుతున్నారన్న విమర్శలున్నాయి.
బ్లడ్ బ్యాంకు ను సీజ్ చేయండి.. బామండ్లపల్లి యుగంధర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి..
కరీంనగర్ బ్లడ్ సెంటర్ ను సీజ్ చేయాలని కోరుతూ అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ వైద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఎండీ రఫీ నగరంలో కరీంనగర్ బ్లడ్ సెంటర్ పేర నిర్వహిస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిల్వచేసిన రక్తనిల్వలను తనే తన బ్లడ్ సెంటర్ కు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. బ్లడ్ నిమిత్తం వెళ్ళిన వారికి సంబంధిత బ్యాగ్ పై కలెక్షన్స్ డేట్ ను తప్పుగా నమోదు చేసి మోసం చేస్తున్నారని .. సంబంధిత కరీంనగర్ బ్లడ్ సెంటర్ నిర్వాహకులపై పారదర్శకంగా విచారణ జరిపి నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
అక్రమాలకు పాల్పడితే చర్యలు.. డా.వీరారెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్..
ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు ఉచితంగా రక్తం అందించేందుకు బ్లడ్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా రక్తం అందిస్తున్నాం. అలాంటి బ్లడ్ బ్యాంకులో అక్రమాలకు పాల్పడ్డట్టు మా దృష్టికి రాలేదు. ఒకవేళ అలా జరిగినట్టు నిర్థారణ అయితే వారి పై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. వారిని విధుల్లో నుంచి తొలగిస్తాం . పూర్తిస్థాయి రికార్డులు పరిశీలించి భవిష్యత్తులో కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా కఠినంగా వ్యవహరిస్తాం.