- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కాంగ్రెస్ సర్కారుపై కర్షకుడి కన్నెర్ర

దిశ,గంగాధర : ఒక్క తడికి నీరిస్తే పంటలు పండేవని ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం చొప్పదండి నియోజకవర్గంకు చెందిన రైతులు, గంగాధర మండల కేంద్రం మధురనగర్ చౌరస్తాలో జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఈ ధర్నాకు మద్దతుగా చొప్పదండి మాజీ శాసన సభ్యులు సుంకె రవిశంకర్ బయలు దేరగా ఆయన్ని పోలీసులు అడ్డుకొని గృహ నిర్భంధం చేశారు. రైతులకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు.
రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించగా పోలీసులు చెదరగొట్టి బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. ఎల్లంపల్లి నుండి నారాయణపూర్ చెరువులోకి నీటిని నింపి కాలువల ద్వారా నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేశారు. నీరందకపోతే దాదాపు వేలాది ఎకరాల్లో పంట నష్టపోతామని రైతులు వాపోయారు. నీళ్లు వదలకపోతే కరీంనగర్ కలెక్టరేట్, ఎస్‌ఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. దాదాపు 100 మంది రైతులు పాల్గొన్న ఈ ఆందోళనను పోలీసులు జోక్యం చేసుకుని విరమింపజేశారు.
నిరసన తెలిపితే అరెస్ట్ చేస్తారా : సుంకె రవిశంకర్
మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ ముందుచూపు లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం జలాలు సకాలంలో అందించక పోవడంతోనే రైతులకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. కాళేశ్వరం జలాలు విడుదల చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందన్న అక్కసుతో రేవంత్ రెడ్డి రైతులను అరిగోస పట్టిస్తున్నాడని మండిపడ్డారు. పదేళ్లుగా నీటి కరువును చూడలేదని, జలాశయాల్లో నీరు ఉన్నా ఇవ్వలేని దద్దమ్మ సర్కారు అంటూ మండిపడ్డారు.
ఎండిన పంటలకు తక్షణమే ఎకరాకు 20 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చివరి ఆయకట్టు వరకు నీరు ఇస్తామని ప్రగల్బాలు పలికాడని, నేడు అడిగితే దాబాయిస్తున్నాడని అన్నారు. ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే రైతులను దాబాయించడం కాదని, ఎండిపోయిన పంటలను పరిశీలించి న్యాయం చేయాలని సూచించారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో హరీష్ రావు, కేటీఆర్ సిద్ధమవుతున్నారని అన్నారు.