గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో ఘోర వైఫల్యం : బండి సంజయ్

by Aamani |   ( Updated:2023-09-26 10:10:58.0  )
గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో ఘోర వైఫల్యం :  బండి సంజయ్
X

దిశ,కరీంనగర్: గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మరి కొద్ది గంటల్లో గణేష్ నిమజ్జనం జరగాల్సి ఉన్నప్పటికీ… ఇంతవరకు ఏర్పాట్లే పూర్తి చేయలేదని, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేదని అన్నారు. అధికారులు వార్డుల్లోని గణేష్ ఉత్సవ కమిటీల వద్దకు వెళ్లి టవర్ సర్కిల్ కు విగ్రహాలను తీసుకురావొద్దని, నేరుగా నిమజ్జనానికి వెళ్లాలని, లేనిపక్షంలో ఇబ్బంది పడతారంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మీరు బెదిరిస్తే భయపడే పరిస్థితి లేదు. అసలు మీరెవరు బెదిరించడానికి? అందరూ టవర్ సర్కిల్ కు వస్తారు. ఇక్కడి నుండే నిమజ్జనానికి వెళతాం…ఏం చేస్తారో చూస్తా…. మీరు కనుక మళ్లీ బెదిరిస్తే… నేనే అక్కడికి వస్తా. అక్కడే కూర్చుంటా… చూద్దాం ఏం చేస్తారో… మీరు బెదిరిస్తే పండుగలు జరుపుకునే దుస్థితిలో హిందూ సమాజం లేదు.అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.

రేపు జరగబోయే వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం, కరెంట్ వైర్లు తొలగించకపోవడం, నిమజ్జన ఏర్పాట్లు చేయకపోవడాన్ని గమనించిన బండి సంజయ్ అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రేపు నిమజ్జనం జరగబోతుంటే ఇప్పుడు తూతూ మంత్రంగా సిమెంట్ పనులు చేస్తుండటమేంటని మండిపడ్డారు. గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఇక్కడికి వచ్చాను. భక్తి యుత, ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు పూర్తి కావాలి. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నగరంలోని గణనాథులంతా రేపు టవర్ సర్కిల్ కు రావాలి. వినాయక నిమజ్జన ఏర్పాట్లలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. ఇంకా కరెంటు వైర్లు తొలగించలేదు. ఇప్పుడు సిమెంట్ పనులు మొదలు పెట్టారు. తూతూ మంత్రంగా సమీక్ష తోనే అధికారులు సరిపెట్టారు. భక్తులకు సౌకర్యాల కల్పనలో పూర్తిగా విఫలమయ్యారు. పట్టీపట్టనట్లు వ్యవహరిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఇట్లనే ఉంటే భక్తులు ఆగ్రహావేశాలకు గురవుతారు. దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed