రావణ పాలనపోయి రామ పాలన వచ్చింది

by Sridhar Babu |
రావణ పాలనపోయి రామ పాలన వచ్చింది
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : రాష్ట్రంలో రావణపాలన పోయి రాముని పాలన వచ్చిందని, అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎస్పీ అఖిల్ మహాజన్ లతో కలిసి ఆయన జిల్లా అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాంచందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్లలో జరిగిన నేరెళ్ల ఘటన

దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించిన ఘట్టమని, గత ప్రభుత్వంలో వార్ వన్ సైడ్ ఉండడం వల్ల బాధితులకు న్యాయం జరగలేదని మండిపడ్డారు. ఘటనలో చాలా మంది దళితులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. నేరెళ్ల ఘటన ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉందని, వారికి ఏ విధంగా న్యాయం జరగాలన్నది నిష్పక్షపాత విచారణ మరోసారి నిర్వహించాలని కమిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తామన్నారు. ఘటనలో ఉన్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి తనవంతు కృషి చేస్తానని, నేరెళ్ల బాధితులకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.

ఎస్సీలకు రాజ్యాంగ హక్కులు అందాలి

రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఎస్సీలకు రావాల్సిన హక్కులు వారికి అందుతున్నాయా లేదా పరిశీలించి సకాలంలో అందించాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీలకు కేటాయించిన అసైన్డ్ ల్యాండ్స్ పట్టాలు అందించే అవకాశంపై రెవెన్యూ శాఖ అధికారులతో చర్చించి తగిన ఆదేశాలు జారీ చేశామని, విదేశీ విద్య పథకం, గురుకుల పాఠశాలలో ఎస్సీ విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతి సౌకర్యాల, బెస్ట్ అవైలబుల్ స్కూల్ పై రివ్యూ చేసామని తెలిపారు. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులో సకాలంలో పరిష్కరించాలని,

అట్రాసిటీ కేసుల పరిహారం సకాలంలో అందించాలన్నారు. పార్లమెంట్ 2018 లో 18 ఏ సేక్షన్ కింద ఎస్సీలు అందించిన ఫిర్యాదులకు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి సంబంధిత నేరస్తులను అరెస్టు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అన్యాయం జరిగిన నిమ్న వర్గాల ప్రజలకు అండగా ఎస్సీ కమిషన్ ఉంటుందని, దీనిని ప్రజలంతా గమనించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఎస్సీ కమిషన్ సంచాలకులు సునీల్ కుమార్ బాబు, రిసర్చ్ అధికారి డి. వరప్రసాద్, అదనపు ఎస్పీ చెంద్రయ్య, ఈ డీఎస్సీ కార్పొరేషన్ సభ్యులు వినోద్, సిరిసిల్ల వేములవాడ ఆర్డీవోలు రమేష్, రాజేశ్వర్, తహసీల్దార్లు జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed