మరోసారి రంగంలోకి జస్టిస్ పీసీ ఘోష్.. తెలంగాణ స్టేట్ పాలిటిక్స్‌లో తీవ్ర ఉత్కంఠ..!

by Disha Web Desk 19 |
మరోసారి రంగంలోకి జస్టిస్ పీసీ ఘోష్.. తెలంగాణ స్టేట్ పాలిటిక్స్‌లో తీవ్ర ఉత్కంఠ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వయిరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నగరానికి చేరుకున్నది. దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను జస్టిస్ పీసీ ఘోష్ నేరుగా సందర్శిస్తారు. ఇప్పటికే ఈ బ్యారేజీలకు జరిగిన నష్టాన్ని నివేదికల ద్వారా అధ్యయనం చేసిన ఆయన ఇప్పుడు ఫిజికల్‌గా పరిశీలించి అక్కడి ఇరిగేషన్ అధికారుల నుంచి మరిన్ని వివరాలను తెలుసుకోనున్నారు. పరిశీలన అనంతరం రాత్రికి రామగుండంలోని గెస్ట్ హౌజ్‌లో బస చేసి మరుసటి రోజు సాయంత్రానికి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. కోల్‌కతా నుంచి విమానంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న వెంటనే రాష్ట్ర ఇరిగేషన్ సెక్రటరీతో సమావేశమై రెండు రోజుల టూర్ గురించి చర్చించారు. గత సమావేశంలో చర్చించుకున్న అంశాలు, వాటికి సంబంధించిన కార్యాచరణ, సాధించిన పురోగతి తదితరాలపై సమీక్షించారు.

పలు అంశాలపై అధ్యయనం

గత సమావేశంలో రివ్యూ చేసిన ‘ఫైవ్ మెన్ కమిటీ’ రిపోర్టు, అందులో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ ఐదుగురు ఇంజనీర్లు, నిపుణులు చేసిన సిఫారసులు, రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు, చివరకు జరిగిన నిర్ణయాలు, ప్రాజెక్టుకు సంబంధించిన స్థలాన్ని ఖరారు చేయడంలో వెల్లడైన అభ్యంతరాలు, ఆర్థిక-సాంకేతిక అంశాల్లో ఎదురయ్యే సవాళ్లు.. ఇలాంటి అంశాలన్నింటినీ జస్టిస్ పీసీ ఘోష్ అధ్యయనం చేయనున్నారు. ఆ తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికతో పాటు మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న పిల్లర్లకు రానున్న వర్షాకాలం సమయానికి చేయాల్సిన రిపేర్ పనులపై అక్కడి తెప్పించాల్సిన రిపోర్టు.. తదితర అంశాలపైన కూడా ఈ నెల 9న బీఆర్‌కేఆర్ భవన్‌లో ఆఫీసర్లతో జరిగే సమీక్షలో ఆయన లోతుగా చర్చించనున్నారు.

అంతా గోప్యంగా..

ఆ రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సమావేశం జరగనున్నది. భోజన విరామం అనంతరం సాయంత్రం ఆరు గంటల వరకు అధికారులతో ఇదే మీటింగ్ కంటిన్యూ అయ్యేలా షెడ్యూలు ఖరారైంది. ఆ తర్వాత 10, 11 తేదీల్లోనే నగరంలోనే ఉండే జస్టిస్ పీసీ ఘోష్ ఎవరెవెరితో చర్చిస్తారనేది మాత్రం గోప్యంగానే ఉండిపోయింది. రిజర్వు పేరుతో రెండు రోజుల యాక్టివిటీస్‌ను బయటకు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నెల 12న సాయంత్రం తిరిగి కోల్‌కతాకు వెళ్ళిపోనున్నారు.

గత నెల చివరి వారంలో ఫస్ట్ టైమ్ విజిట్‌కు వచ్చిన ఆయన పలువురు ఇరిగేషన్ అధికారులతో సమావేశమై ప్రాథమిక స్థాయిలో చర్చించారు. సెకండ్ విజిట్‌లో మేడిగడ్డ సహా మూడు బ్యారేజీలను ఫిజికల్‌గా సందర్శిస్తానని స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధం ఉన్న అధికారులందరితో చర్చిస్తానని, రిటైర్ అయిన అధికారులను కూడా పిలిపిస్తామన్నారు. రాజకీయ నాయకులకు సైతం అవసరమైతే సమన్లు జారీచేస్తామని, వారితోనూ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను చర్చిస్తామని తెలిపారు. కొద్దిమంది ఆఫీసర్లతో ప్రస్తుత సెకండ్ విజిట్‌లో చర్చించనున్న జస్టిస్ పీసీ ఘోష్ రిటైర్డ్ ఆఫీసర్లు, రాజకీయ నాయకులకు నోటీసులు ఇవ్వడంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశమున్నది.

Next Story

Most Viewed