కంటి తుడుపుగానే.. ‘కంటి లొసుగు’

by Sathputhe Rajesh |
కంటి తుడుపుగానే.. ‘కంటి లొసుగు’
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా లెక్కల్లో చూపినట్లే కంటి వెలుగులోనూ ప్రభుత్వం తప్పుడు వివరాలను చూపిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1500 టీమ్‌లతో కంటి వెలుగు క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంటున్నది. అయితే పలు చోట్ల క్యాంపులకు స్పందన కరువవుతోంది. దీన్ని అదునుగా తీసుకొని సిబ్బంది తప్పుడు లెక్కలు చూపిస్తోంది. కంటి పరీక్షలు చేయించుకోని వారు చేయించుకున్నట్లుగా స్టాఫ్ ​రికార్డుల్లో ఎంట్రీ చేస్తున్నారు. గతంలో వ్యాక్సినేషన్ ​నిర్వహించిన డేటానే వాడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

గ్రేటర్​ హైదరాబాద్‌లోనే ఎక్కువగా జరగడం ఆశ్చర్యకరం. వ్యాక్సినేషన్ ​డేటాను ఆధారంగా చేసుకొని క్యాంపులకు రాని వారి వివరాలను కంటి వెలుగులో నమోదు చేస్తున్నారు. అలా ఎంట్రీ చేసిన వారికి ఎలాంటి కంటి సమస్యలు లేనట్టు చూపుతున్నారు. ఒక వేళ సదరు వ్యక్తులు రెండు, మూడు రోజుల తర్వాత క్యాంపులను ఆశ్రయించినా... ఆలెడ్రీ ఎంట్రీ చేసినందున చెకప్‌ చేసి పంపిస్తున్నారని స్వయంగా వైద్యశాఖ సిబ్బందే ఆఫ్​ది రికార్డులో చెబుతున్నారు.

అద్దాలకూ గోసే..

కంటి వెలుగు క్యాంపుల్లో రీడింగ్​ గ్లాసెస్‌ను మాత్రమే వేగంగా అందిస్తున్నారు. ప్రిస్ర్కిప్షన్ గ్లాస్‌ల కోసం నెలల కొద్ది వేచిచూడాల్సి వస్తున్నది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయించుకుంటున్న వారికి 20 నుంచి 30 రోజుల వ్యవధిలో గ్లాసులు ఇస్తున్నప్పటికీ, స్పెషల్​క్యాంపుల్లో పరీక్షలు చేయించుకుంటున్న వారికి అద్దాలు అందడం లేదు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో పరీక్షలు నిర్వహించుకున్న రిపోర్టర్లకు ఇప్పటి వరకూ గ్లాసెస్‌లు ఇవ్వలేదు. జిల్లాల్లో పరిస్థితి ఆధ్వానంగా ఉంది. ప్రిస్ర్కిప్షన్ గ్లాసుల్లో ఇప్పటి వరకు 5 శాతం మందికి కూడా పంపిణీ చేయలేదని సమాచారం. కానీ రికార్డుల కోసం ప్రభుత్వం హాడావుడి చేస్తోందని హెల్త్ డిపార్ట్‌మెంట్ స్టాఫ్ పేర్కొంటోంది.

బులెటెన్‌లోనూ తప్పులే..

రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు వివరాలను ప్రభుత్వం ఓ హెల్త్ బులెటెన్​ ద్వారా రిలీజ్ ​చేస్తున్నది. వాటిలోనూ అన్ని తప్పులే ఉంటున్నాయి. ఈ నెల 2వ తేది వరకు స్క్రీనింగ్ చేసి వారి మొత్తం సంఖ్య 61,84,966 ఉండగా, 3వ తేది మరో 1,96,924 మంది టెస్టులు చేశారు. అంటే 63,81,890 మందికి స్క్రీన్ ​చేసినట్లు లెక్క. కానీ సర్కార్ ఇచ్చిన రిపోర్టులో 63,82,201గా పొందుపరిచారు. ఇక 2వ తేది వరకు 11,12,348 మందికి రీడింగ్ ​గ్లాసులు ఇవ్వగా, 3వ తేది మరో 25,028 మందికి ఇచ్చారు.

అంటే 11,37,373 మందికి రీడింగ్ అద్దాలు ఇచ్చారు. కానీ బులెటెన్‌లో ఏకంగా 11,40,050 మందికి ఇచ్చినట్లు చూపించారు. దీంతో పాటు మూడో తేది వరకు 8,06,074 మంది ప్రిస్ర్కిప్షన్ గ్లాసులు రిఫర్ ​చేయగా, ప్రభుత్వ లెక్కల్లో 8,08,393 మందిని రికార్డుల్లో ఎంట్రీ చేశారు. ప్రతి రోజూ ఇలాంటి తప్పుడు లెక్కలు వస్తున్నప్పటికీ వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. కంటి వెలుగు క్యాంపులో తప్పుడు లెక్కలు పరిగణలోకి తీసుకుంటున్నారనడానికి ఇది ఒక నిదర్శనం.

Advertisement

Next Story

Most Viewed