హస్తం గూటికి ఏనుగు రవీందర్ రెడ్డి, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి?

by Javid Pasha |   ( Updated:2023-07-06 16:55:42.0  )
హస్తం గూటికి ఏనుగు రవీందర్ రెడ్డి, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి?
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎన్నం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారన్న వార్తలు ఊపందుకున్నాయి. పార్టీలో కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభన, తాజాగా చోటుచేసుకున్న మార్పులు చేర్పుల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలతో వీరిద్దరి సంప్రదింపులు ముమ్మరమయ్యాయి. పార్టీలోని తాజా పరిణామాల నేపథ్యంలో అందులో ఇమడలేక వీరు కాంగ్రెస్‌లో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏనుగు రవీందర్‌రెడ్డి ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో చర్చలు జరిపినట్లు గాంధీభవన్ వర్గాల సమాచారం. మహబూబ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి కూడా ఆ జిల్లాకే చెందిన జూపల్లి కృష్ణారావుతో చర్చలు జరిపారు. బీజేపీని విడిచిపెట్టి కాంగ్రెస్‌లో చేరడమే వీరి మధ్య జరిగిన చర్చల ప్రధాన ఉద్దేశమని సమాచారం.

రవీందర్ రెడ్డికి టికెట్టుపై నోక్లారిటీ..

ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి రెండేండ్ల క్రితమే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఈటల రాజేందర్ తో కలిసి నడుస్తున్నారు. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ఈటలతో పాటే కలిసి వెళ్లేవారు. ఇటీవల గౌహాతికి వెళ్లినప్పుడు కూడా ఈటల వెంటే ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్‌ను నియమించిన తర్వాత శామీర్‌పేట్‌లోని ఆయన నివాసంలో సందడి నెలకొన్నా, ఏనుగు రవీందర్ రెడ్డి కనిపించకపోవడం చర్చకు దారితీసింది. కిషన్‌రెడ్డిని అధ్యక్షుడిగా, ఈటల రాజేందర్‌ను కమిటీకి చైర్మన్‌గా నియమించడానికి ఐదారు రోజుల ముందే రేవంత్‌తో ఏనుగు రవీందర్ రెడ్డి చర్చలు జరిపినట్లు తెలిసింది. అయితే ఎల్లారెడ్డిలో ఇప్పటికే మదన్‌మోహన్‌రావు, సుభాష్‌రెడ్డి మధ్య టికెట్ వార్ నడుస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీలో చేరినా అక్కడ అవకాశం ఇవ్వడం కష్టమేనని రేవంత్ క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. బాన్సువాడ నుండి అవకాశం కల్పిస్తామని చెప్పినా, తాను అక్కడ నాన్-లోకల్ అవుతానని, ఇబ్బందులుంటాయని రవీందర్ రెడ్డి సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. దీంతో టికెట్లు ఇచ్చేవరకు బీజేపీలోనే కొనసాగి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలనే ఆలోచనలో సైతం ఏనుగు రవీందర్ రెడ్డి ఉన్నట్లు తెలిసింది.

కాంగ్రెస్ లో చేరేందుకు శ్రీనివాస్ రెడ్డి ఆసక్తి

మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆ జిల్లాలోని తన సన్నిహితులతో ఇప్పటికే ఈ విషయాన్ని చర్చించి కొన్ని రోజులు వేచి చూసిన తర్వాత వెళ్లాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో బంధుత్వం ఉండడం, మహాబూబ్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థి లేకపోవడం కూడా ఎన్నం శ్రీనివాసరెడ్డికి కలిసొచ్చే అంశం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి రావడంతో పార్టీ కార్యకలాపాలు, విజన్ చూసిన తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లే విషయాన్ని కాస్త సమయం తీసుకుని ఆలోచించాలనే ధోరణితో ఉన్నట్లు తెలిసింది. మరికొన్ని వారాల్లో పార్టీ మారడంపై స్పష్టత రానున్నది.

Advertisement

Next Story