గవర్నర్‌, సీఎం KCR మధ్య సఖ్యత కుదిరినట్టేనా..?

by Nagaya |   ( Updated:2023-01-31 02:58:06.0  )
గవర్నర్‌, సీఎం KCR మధ్య సఖ్యత కుదిరినట్టేనా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : కొంతకాలంగా రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య నెలకొన్న అగాధం కొలిక్కి వచ్చినట్లేనా? గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య విభేదాలు సమసిపోయినట్లేనా? పరిపాలనాపరంగా సర్కారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించినట్లేనా? దాదాపు ఐదు నెలలకు పైగా రాజ్‌భవన్‌లోనే పెండింగ్‌లో ఉన్న ఏడు బిల్లులకు మోక్షం కలిగినట్లేనా..? వీటన్నింటికి తాజా పరిణామాలు ఔననే సమాధానాలన్నే ఇస్తున్నాయి. చాలాకాలంగా రాజ్‌భవన్‌కు వెళ్లని మంత్రులు హైకోర్టులో పిటిషన్ విచారణ తర్వాత అడుగు పెట్టారు. గవర్నర్‌తో మాట్లాడడానికే సుముఖంగా లేని మంత్రులు ఆహ్లాదకర వాతావరణంలో ఆమెతో చర్చించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా ఆహ్వానించారు. గ్రాండ్ వెల్‌కమ్‌కు ప్రభుత్వ వర్గాలు కూడా ఏర్పాట్లపై దృష్టి పెట్టాయి.

బడ్జెట్‌కు ఆమోదం తెలపకపోగా..

ఏడాదికి పైగా ఈస్ట్-వెస్ట్ తరహాలో ఉన్న పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వచ్చే నెల 3న షురూ అయ్యే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రధాన న్యాయమూర్తి చొరవ తీసుకుని రాజ్‌భవన్, ప్రభుత్వ న్యాయవాదులు పరస్పరం ఆరోగ్యకరమైన తీరులో చర్చించుకోడానికి అవకాశం కల్పించారు. రెండు వ్యవస్థల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి చేసిన ప్రయత్నం సత్ఫలితాలను ఇచ్చింది. పిటిషన్‌లో పేర్కొన్న అంశాలపై ఇరు తరఫున న్యాయవాదుల వాదనలు ఎలా ఉన్నా ఒక కొలిక్కి తీసుకురావడానికి వారికే బాధ్యత అప్పజెప్పే తీరులో తీసుకున్న చొరవ ఆశించిన ఫలితాలనే ఇచ్చింది. దానికి కొనసాగింపే రాజ్‌భవన్‌కు వెళ్లి మంత్రులు చర్చలు జరిపి అగాథాన్ని పూడ్చే ప్రయత్నం జరిగింది.

గవర్నర్ లేవనెత్తిన సందేహాలకు..

గతేడాది సెప్టెంబరులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఏడు బిల్లులకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. అందులో ఒక్క జీఎస్టీ బిల్లు మినహా మిగిలిన వాటిని గవర్నర్ పరిశీలన పేరుతో తన దగ్గరే ఉంచుకున్నారు. వాటికి ఆమోదం తెలపలేదు. పలు సందేహాలు నివృత్తి కావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. యూనివర్శిటీల్లోని ఖాళీ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ఆమోదించిన కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుపై గవర్నర్ లేవనెత్తిన సందేహాలకు మంత్రి సబిత రాజ్‌భవన్‌కు వెళ్లి వివరించారు. ఆ బిల్లుకు ఆమోదం లభిస్తుందని ప్రభుత్వం భావించింది. కానీ గవర్నర్, మంత్రి మధ్య చర్చలు జరిగి రెండు నెలలు దాటినా బిల్లుకు క్లియరెన్స్ రాలేదు. అదే దారిలో మరో ఐదు బిల్లులు కూడా ఉన్నాయి. ఈ విషయాలను కూడా సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లినప్పుడు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రస్తావించారు. త్వరలోనే వీటన్నింటికి గవర్నర్ నుంచి ఆమోదం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

హైకోర్టు చొరవతో విపక్షాలతో నో చాన్స్

హైకోర్టు సీజే చొరవతో రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ తగ్గడానికి వీలు కలిగింది. దీంతో పాటే పెండింగ్ బిల్లులకు గవర్నర్ నుంచి ఆమోదం లభించింది. ఇప్పటికి మెరుగుపడిన సంబంధాలు అసెంబ్లీ సెషన్స్ తో మళ్లీ పూర్వ స్థితికి చేరుకుంటాయనే ఆశాభావం అధికార పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. గవర్నర్, సీఎం రెండు వ్యవస్థల మధ్య చెదిరిపోయిన సంబంధాలు మెరుగుపడి సయోధ్య కుదరడానికి, సఖ్యత ఏర్పడడానికి హైకోర్టు ద్వారా సాధ్యమైంది. మరోవైపు విపక్షాలు విమర్శలు చేయడానికి ఆస్కారం లేకుండా పోయింది.

Also Read...

మూడు రోజుల గ్యాప్‌లో రెండు మీటింగ్స్.. హీటెక్కనున్న స్టేట్ పాలిటిక్స్!

Advertisement

Next Story

Most Viewed