ఉత్తరాన ఐటీ ఉత్తదేనా..!

by Kalyani |
ఉత్తరాన ఐటీ ఉత్తదేనా..!
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: ఉత్తరాన ఐటీ హాబ్ అన్నారు. పది ఎకరాల్లో రూ.100 కోట్లతో నిర్మిస్తున్నట్లు ఊరించారు. రాష్ట్రంలోనే ఎత్తైన టవర్ అని మురిపించారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే గిప్ట్ అంటూ.. ఆయన పుట్టిన రోజున ఐటీ మంత్రి కేటీఆర్ అట్టహాసంగా భూమిపూజ చేశారు. కానీ శంకుస్థాపన చేసి ఏడాదిన్నర గడిచినా.. ఇప్పటికి పునాది తీయలేదు. ఒక ఇటుక రాయిని కూడా పేర్చలేదు. ఇది మేడ్చల్ జిల్లా కండ్ల కోయలోని తెలంగాణ గేట్ వే పేరిట రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలని తలపెట్టిన ఐటీ పార్కు పరిస్థితి.

సీఎం పుట్టిన రోజున శంకుస్థాపన..

హైదరాబాద్ కు నలువైపులా ఐటీ అభివృద్ధిలో భాగంగా ఉత్తరాదిన మేడ్చల్ జిల్లా కండ్ల కోయను ప్రభుత్వం ఎంపిక చేసింది. మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్న మార్కెట్ యార్డుకు చెందిన సర్వే నెంబర్ 125లోని 10 ఎకరాల 12 గుంటల స్థలాన్ని ఐటీ పార్కు కోసం కేటాయించింది. 2022 ఫిబ్రవరి 17వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఐటీ పార్కుకు పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు శంకుస్థాపన చేశారు. ఐటీ పార్క్ బాధ్యతను టీఎస్ఐఐసీకి అప్పగించింది.

రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన భారీ ఐటీ సౌధాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ.100 కోట్లలో నిర్మించాలని అనుకున్నారు.100 ఐటీ కంపెనీలకు వసతి కల్పించి, ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షకు పైగా ఉద్యోగాలను కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఐటీ పార్కులో కార్యాలయ భవనాలు, వాణిజ్య కేంద్రం, హోటల్ నివాస భవనాలు, అతిథ్య కేంద్రాలు, వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

సంవత్సరం దాటినా..

కండ్లకోయ ఐటీ హాబ్ నిర్మాణానికి 2022, జూన్ 27వ తేదీన టెండర్ ప్రక్రియను పూర్తి చేశారు. కాంట్రాక్టర్ 36 నెలల లోపు ఐటీ హాబ్ నిర్మించాలని ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా ప్రముఖ ఐటీ కంపెనీలు తమ శాఖలను ఏర్పాటు చేసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. అమెరికా, యూకే, యూరప్ వంటి దేశాలకు చెందిన దిగ్గజ ఐటీ కంపెనీలు సైతం దరఖాస్తు చేసకున్నట్లు కైటీయూ ప్రతినిధులు పేర్కొంటున్నారు. కానీ ప్రభుత్వ పెద్దలు ఐటీ పార్కుకు శంకుస్థాపన ఉత్సాహంగా పార్కు నిర్మాణ పనులు చేపట్టడం లేదని పలువురు ఐటీ కంపెనీల ప్రతినిధులు వాపోతున్నారు. తెలంగాణ గేట్ వే ఐటీ హాబ్ కు భూమి పూజ చేసి ఏడాది దాటినా అక్కడ పునాది రాయి కూడా తీయలేదని పలువురు ఐటీ నిపుణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ ప్రాంతంలో ఐటీ పార్క్ వస్తుందన్న ఉద్దేశంతో భూముల ధరలు మాత్రం అకాశాన్నంటాయి. ఐటీ హాబ్ శంకుస్థాపనకు ముందు ఎకరానికి రూ. 2 నుంచి రూ.3 కోట్లు పలికిన భూములు అమాంతం రెండింతలు అయ్యాయి. ఈ విషయమై టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ ను వివరణ కోరేందుకు ‘దిశ ప్రతినిధి’ ఫోన్ లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా, ఆయన అందుబాటులో లేరని సమాధానం వస్తుంది. ఇప్పటికైనా ఐటీ, టీఎస్ఐఐసీ ఉన్నతాధికారులు స్పందించి ఐటీ పార్కు పనులను ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed