- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కారు’లో అంతర్మథనం..! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓటమికి కారణమిదేనా..?
దిశ ప్రతినిధి, నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కారు పార్టీ ఊడ్చి పారేసిన రీతిలో పరాజయం కావడానికి కారణం ఏంటి..? మరికొన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలు కావడంపై పార్టీలో అంతర్మథనం మొదలైంది. అభ్యర్థులను మార్చిన రెండు చోట్ల మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది మిగిలిన 8 చోట్ల అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. మూడు నియోజకవర్గాల్లో తక్కువ మెజారిటీతో అభ్యర్థులు ఓడిపోగా మిగతా ఐదు చోట్ల మాత్రం అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. మరీ ఇంతలా ఓటమికి కారణం ఏంటని తమ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి.
ఓటమి మరీ ఇంత దారుణమా..?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీ పూర్తిగా ఊడ్చుకుపోవడానికి కారణాలు ఏమిటన్నది ఆరా తీస్తున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో సుమారు 5000 ఓట్లతో, సిర్పూర్ నియోజకవర్గంలో 3,000 పైచిలుకు ఓట్లతో పార్టీ అభ్యర్థులు ఓడిపోగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో సుమారు ఆరున్నర వేల ఓట్లతో అక్కడి అభ్యర్థి ఓడిపోయారు. ఈ మూడు చోట్ల హోరా హోరి పోరు జరిగినప్పటికీ ఫలితం దక్కలేదు.
ఖానాపూర్ అభ్యర్థికి పార్టీకి చెందిన కొందరు సీనియర్లు పూర్తిస్థాయిగా మద్దతు ఇవ్వలేదని, మరికొందరు నేతలు నాన్ లోకల్ వ్యక్తికి అవకాశం ఇవ్వడాన్ని లోలోపల బెదిరించినట్లు చెప్పుకొస్తున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో అటు ఇటుగా పార్టీ గెలిచే అంచులకు వెళ్లి ఓడిపోయింది. ఆ నియోజకవర్గంలో కూడా అభ్యర్థికి సన్నిహితంగా ఉండే కొందరు నేతలు వెన్నుపోటు పొడిచినట్లు పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతున్నది. ఆదిలాబాద్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం.
మిగతా ఐదు చోట్ల మరీ దారుణం..!
ఓడిపోయిన మిగిలిన 5 చోట్ల ఓటమి ఫలితాలు మరీ దారుణంగా నమోదయ్యాయి. ముఖ్యంగా నిర్మల్ అభ్యర్థి 50 వేల పైచిలుకు ఓట్లతో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నియోజకవర్గాన్ని ఇంతలా అభివృద్ధి చేస్తే... తనకు ఇంతటి దారుణమైన ఫలితాలు రావడంపై తీవ్రంగా ఆలోచిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. కొందరు ముఖ్య నేతలు వెన్నుపోటు పొడిచినట్లు ఆయనకు సమాచారం ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు పార్టీ నేతలు కార్యకర్తలు ప్రచారం జరుగుతున్న సందర్భంగా వచ్చిన వ్యతిరేక ఫీడ్ బ్యాక్‌ను అభ్యర్థికి చెప్పలేదని... కొన్ని ప్రాంతాల్లో అనేకమంది కార్యకర్తలు వెంట తిరుగుతూనే పార్టీ అభ్యర్థికి ఓటు వేయలేదని కూడా ప్రచారం జరుగుతున్నది.
ఆయన నమ్ముకున్న అనేక ప్రాంతాల్లో తీవ్రమైన ప్రతికూల ఫలితాలు రావడానికి జీర్ణించుకోవడంలేదని అంటున్నారు. ముధోల్ నియోజకవర్గంలో కొందరు నేతలు బహిరంగంగానే వెన్నుపోటు రాజకీయాలు చేసినట్లు సమాచారం అప్పటికే కొందరు పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోగా మిగిలిన కొందరు బీజేపీకి చాపకింద నీరులా పనిచేసినట్లు ఇప్పుడు సమాచారం బయటకు వస్తున్నట్లు నియోజకవర్గంలో చర్చ ఉంది. ఇంకొందరు నేతలు కోవర్ట్ పాలిటిక్స్ చేసినట్లు పార్టీకి సమాచారం అందింది.
చెన్నూరు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిని ప్రతినిత్యం ఆయనను అంటిపెట్టుకొని ఉండే అనుచర ఘనమే గట్టిదెబ్బ తీసినట్లు ఇప్పుడు ప్రచారం మొదలైంది. ప్రచారం సమయంలో చూస్తే హాజరైన జనం చాలు ఓటు వేస్తే గెలిచేందుకు అన్నట్లుగా కనిపించింది. అదంతా పైన పటారం లోన లొటారం... అన్నట్లుగా వెంట తిరిగిన నేతలు ముఖ్య కార్యకర్తలే కాంగ్రెస్ వైపు ఓట్లు వేయించినట్లు ప్రచారం మొదలైంది. బెల్లంపల్లి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. బెల్లంపల్లి పట్టణం తోపాటు రెండు మండలాల ముఖ్య నేతలు ఆయనను వెన్నుపోటు పొడిచినట్లు పార్టీకి సమాచారం అందినట్లు తెలిసింది.
ఇక మంచిర్యాల అభ్యర్థి మూడో స్థానానికి పడిపోవడంపై పార్టీలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇక్కడ రెండో కేడర్ ముఖ్య నేతలందరూ పూర్తిస్థాయిలో సహకరించలేదని తెలుస్తోంది ఆ నేతలపైనే ఉన్న ప్రజల వ్యతిరేకతను ఎమ్మెల్యేపై చూపినట్లు కూడా ప్రచారం ఉంది. మరీ ఇంత దారుణంగా ఓడిపోవడానికి అభ్యర్థుల ప్రవర్తనతో పాటు ఆ పార్టీ నేతలు ముఖ్య కార్యకర్తల తిరుగుబాట్లు వెన్నుపోటు రాజకీయాలే కారణం అని అవగతం అవుతున్నది.
- Tags
- adilabad