చిగురిస్తోన్న ‘సాగర్’ రైతుల ఆశలు.. ఆల్మట్టికి పెరిగిన వరద ప్రవాహం..!

by Bhoopathi Nagaiah |
చిగురిస్తోన్న ‘సాగర్’ రైతుల ఆశలు.. ఆల్మట్టికి పెరిగిన వరద ప్రవాహం..!
X

దిశ నాగార్జునసాగర్ : వర్షాభావ పరిస్థితులు ఏర్పడి ఖరీఫ్‌ సీజన్‌ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కృష్ణా బేసిన్‌కు ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లోకి నీరు వడివడిగా ప్రవహిస్తుండటం ఆశలు రేపుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయం పూర్తిస్థాయి నిల్వ సామర్ద్యానికి చేరువవుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఇంతకుమించి భారీగా వరద నీరు భారీగా చేరుతుందని అంచనా. ఆల్మట్టి నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేస్తే తెలుగు రాష్ట్రాల్ల్రోని నారాయణపూర్‌, జూరాల, తుంగభద్ర.. ఆ తరువాత శ్రీశైలం, నాగార్జున సాగర్‌‌కు వరద నీరు చేరే అవకాశం ఉంది.

చిగురిస్తున్న ఆశలు

కృష్ణ పరివాహక ప్రాంతంలోని ఆల్మట్టి జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుండడంతో దిగవనున్న జలాశయాలలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఆగస్టు నెలలోనే జలాశయాలు నిండిన సంఘటనలు ఉండడంతో నాగార్జునసాగర్ జలాశయం కూడా 2021 సంవత్సరంలో ఆగస్టు ఏడవ తేదీన క్రెస్ట్ గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. అలాగే 2022 సంవత్సరంలో ఆగస్టు మూడో తేదీన ట్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువ కృష్ణకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు నీటి వరద వస్తుండడంతో ఆగస్టులో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉన్నట్లు ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు.

ఆల్మట్టి జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం

పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిపై కర్ణాటక నిర్మించిన ఆల్మట్టి జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. రేపు ఉదయానికి ఇన్ ఫ్లో లక్ష క్యూసెక్కులను దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆల్మట్టిలో నీటి నిల్వ 85 టీఎంసీలకు చేరింది. పూర్తి సామర్థ్యం 130 టీఎంసీలు. శుక్రవారం నాటికి రిజర్వాయర్ గేట్లు తెరిచే అవకాశం ఉంది. ఎగువ నుంచి భారీ వరద వస్తోందని సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి హెచ్చరిక అందడంతో జలవిద్యుత్తు కేంద్రాల్లో ఉత్పాదన ప్రారంభించారు. ఆల్మట్టికి పోటెత్తుతున్న వరద మరో వారం రోజులు ఇలాగే కొనసాగితే శ్రీశైలానికి నీటి రాక మొదలవుతుంది. ఆగస్టు చివరి నాటికి శ్రీశైలం, నాగార్జున జలాశయాలు నిండే అవకాశం ఉంది. ఆల్మట్టి దిగువన ఉన్న నారాయణపుర జలాశయంలో 25 టీఎంసీల ఖాళీ ఉంది. దాని కింద ఉన్న తెలంగాణాలోని జూరాల జలాశయం నీటి నిల్వ స్థానిక వర్షాలతో దాదాపుగా పూర్తి స్థాయికి చేరింది. ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్ల గేట్లు తెరిస్తే జూరాలలో జలవిద్యుత్తు కేంద్రాలను వినియోగంలోకి తెస్తారు. కృష్ణా ఉపనదులు తుంగ, భద్ర నదులపై రిజర్వాయర్లు వేగంగా నిండుతున్నాయి.

ఆయకట్టు రైతులు ఎదురుచూపులు

గత కొన్నేళ్లుగా ఆగస్టు నెలలో వచ్చే ఇన్‌ఫ్లోతో సాగర్‌ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటి విడుదల సాధ్యమైంది. ఈ వర్షాకాలంలో ఆగస్టు మాసాంతం వచ్చినా అలాంటి పరిస్థితి లేకపోవడంతో 5.50లక్షల ఆయకట్టులో వానకాలం పంట సాగు ఆలస్యం కాకతప్పని దుస్థితి నెలకొంది. వరదలు వెనుకో ముందో వస్తాయన్న ఆశతో కొంతమంది భూగర్భ జల వసతులున్న రైతులు నాట్లు వేయగా, మరికొందరు వరినార్లు పోసుకుని సాగర్‌ ప్రాజెక్టు నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. వరినార్లు ముదిరిపోతుండటం రైతాంగంలో ఆందోళన కల్గిస్తుంది. వర్షాలు కరువై సాగర్‌కు ఎగువ నుంచి సకాలంలో వరద ఉధృతి రాకపోతే వేసిన వరినాట్లు, పోసిన నారుమడులు నష్టపోవాల్సివస్తుందన్న ఆందోళన రైతాంగంలో వ్యక్తమవుతుంది.

నాగార్జున సాగర్‌లో ఇదీ పరిస్థితి..

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 590 అడుగులు కాగా ప్రస్తుతం 573.6 అడుగుల మేర నీరు చేరింది. ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 312.045 టీఎంసీలు కాగా గురువారం నాటికి 265.61 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 93,630 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 6,529 క్యూసెక్కులుగా నమోదయింది.

పులిచింతల ప్రాజెక్టులో ఇలా..

పులిచింతల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 175 అడుగులు కాగా, ప్రస్తుతం 15.24 అడుగుల మేర నీరు ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 16.58 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 18,647 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 100 క్యూసెక్కులుగా ఉంది. గత ఏడాది ఆగస్టు నాటికి పులిచింతల ప్రాజెక్టులో 168.239 అడుగుల మేర 35.9097 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Advertisement

Next Story