తొలి వాయిదాలోనే చుక్కెదురు.. స్టేట్‌కు లోన్ డౌటే!

by Rajesh |
తొలి వాయిదాలోనే చుక్కెదురు.. స్టేట్‌కు లోన్ డౌటే!
X

దిశ, తెలంగాణ బ్యూరో:ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 40,615 కోట్ల రుణాన్ని తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో అంచనా వేసుకుంది. ఫస్ట్ క్వార్టర్ (ఏప్రిల్-జూన్)లో రూ. 12,500 కోట్లను తీసుకోనున్నట్లు రిజర్వు బ్యాంకుకు తెలిపింది. ఆ ప్రకారం ఈ నెలలో 11న ఆర్బీఐ ద్వారా రూ. 2,000 కోట్లను ఓపెన్ మార్కెట్ బారోయింగ్ పేరుతో తీసుకోవాల్సి ఉన్నది.

మొదటి మూడు నెలలకు ఏ తేదీన ఎంత రుణం తీసుకోనున్నదీ ఆర్బీఐకి ఇండికేటివ్ క్యాలెండర్ రూపంలో ప్రతిపాదనలు పంపింది. ఆర్బీఐ ద్వారా ఈ నెల 11న 15 రాష్ట్రాలూ కలిపి తీసుకోవాల్సిన రుణం రూ. 22,500 కోట్లుగా పేర్కొన్నది. కానీ అందులో తెలంగాణ పేరు లేకపోవడం గమనార్హం. షెడ్యూలు ప్రకారం తెలంగాణ రూ. 2,000 కోట్లను తీసుకోవాలని భావించినా చివరి నిమిషంలో పేరు ఎందుకు మాయమైందనేది మిస్టరీగా మిగిలిపోయింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫస్ట్ అటెంప్ట్‌లోనే తెలంగాణకు రిజర్వు బ్యాంకు నుంచి చుక్కెదురైంది. రుణం తీసుకోవాలని ప్రణాళిక వేసుకున్నా చివరి నిమిషంలో ఎందుకు వెనక్కి వెళ్లిపోయిందనేదానిపై రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు వివరణ ఇవ్వలేదు. కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించలేదా?.. ఇండికేటివ్ క్యాలెండర్‌లో రాష్ట్రం చేసిన ప్రతిపాదనలకు కొర్రీలు పెట్టిందా?.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రానందువల్ల రిజర్వుబ్యాంకు పెండింగ్‌లో పెట్టిందా?.. ఇలాంటి ప్రశ్నలకు రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు వివరణ ఇవ్వలేదు. వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో ఆ శాఖ అధికారులు కూడా అందుబాటులో లేరు. ఏపీ ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌లోనే రూ. 5,000 కోట్లను తీసుకోడానికి సిద్ధమవుతున్నది. తెలంగాణకు ఎందుకు అవకాశం లభించలేదన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది.

గతేడాది సైతం చేదు అనుభవం

గత ఆర్థిక సంవత్సరంలో సైతం ఫస్ట్ క్వార్టర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి రుణం తీసుకోవడంలో ఇలాంటి చిక్కులే ఎదురయ్యాయి. ఇండికేటివ్ క్యాలెండర్‌లో స్పష్టంగా ఏ తేదీన ఎంత రుణం తీసుకోవాలన్నది నిర్ణయించుకున్నప్పటికీ మూడు నెలల పాటు ఎలాంటి అప్పును రాష్ట్రం పొందలేకపోయింది. రూ. 53,970 కోట్ల రుణాల బడ్జెట్ అంచనాలు రూ. 38,500 కోట్లకు తగ్గిపోయింది. గతేడాది అనుభవమే ఈసారి సైతం రిపీట్ కానున్నదేమోననే అనుమానాలు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులను వెంటాడుతున్నాయి.

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సెప్టెంబరు చివరికల్లా రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న సంక్షేమ పథకాలకు నిధులను విడుదల చేయాలని భావించింది. ఇందుకోసం మొదటి మూడు క్వార్టర్లలో తీసుకునే రుణాన్ని ఫస్ట్, సెకండ్ క్వార్టర్‌లలోనే తీసుకోవాలని అనుకున్నది. కానీ ఫస్ట్ క్వార్టర్ ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌‌లోనే రాష్ట్ర ప్రభుత్వానికి రుణం తీసుకునే వెసులుబాటు లభించలేదు. కేంద్రం ఆంక్షలు విధించినందుకా? లేక రాష్ట్ర ప్రతిపాదనలకు ఆమోదం తెలపనందుకా? లేక రిజర్వు బ్యాంకుకు గ్రీన్ సిగ్నల్ వెళ్లనందుకా అనేది సోమవారం తర్వాత వెల్లడి కానున్నది.

Advertisement

Next Story

Most Viewed