వీడిన మర్డర్ కేసు మిస్టరీ.. దృశ్యం సినిమాను తలపించే ట్విస్టులు

by Naveena |
వీడిన మర్డర్ కేసు మిస్టరీ.. దృశ్యం సినిమాను తలపించే ట్విస్టులు
X

దిశ, నల్లగొండ క్రైం: నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గీతాంజిలి అపార్ట్మెంట్ లోని మణికంఠ కలర్ ల్యాబ్ ఓనర్ గద్దపాటి సురేశ్ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. రిటైర్డ్ ఎక్సైజ్ సీఐ మాతరి వెంకటయ్య తన కుమార్తె గద్దపాటి ఉమామహేశ్వరిని నకిరేకల్ పట్టణానికి చెందిన గద్దపాటి నరేష్ అనే యువకుడితో 2017లో వివాహం చేశాడు. కొన్నాళ్లవరకు సంసారం సజావుగా సాగినా, నరేష్ మరొక స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకుని తన భార్యను దూరంగా ఉంచడంతో.. ఆమెను శారీరకంగా మానసికంగా హింసకు గురిచేస్తున్నాడు.

దీంతో భార్యాభర్తల మధ్య వివాదాలు మొదలై కోర్టులో కేసు నడుస్తోంది. ఈ విషయానికి కారణం గద్దపాటి నరేష్ అన్న అయిన సురేష్ కారణమని కక్ష పెంచుకున్నాడు. సురేష్ కూడా మరొక స్త్రీతో చాలా కాలం నుంచి సాన్నిహిత్యంగా ఉంటూ.. తన భార్యకు దూరంగా ఉంటున్నాడు. అతడు తన తమ్ముడు నరేశ్ కూడా వివాహేతర సంబంధం కొనసాగించేందుకు ప్రోత్సహిస్తున్నాడని, అతడిని ఏ విధంగానైనా హతమార్చాలని ప్రణాళిక వేసుకున్నాడు. సురేష్ ను చంపేస్తే తన అల్లుడు నరేష్ తన భార్యతో మంచిగా ఉంటాడన్న దురాలోచనతో పథకం ప్రకారం హైదరాబాదులోని కొత్తపేటకు చెందిన “ స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీ” కి చెందిన చిక్కు కిరణ్ కుమార్‌ అలియాస్ సీకే కుమార్ ను సంప్రదించాడు.అతని ద్వార నిఘా పెట్టించాడు.

దర్యాప్తులో నరేష్ మరో మహిళతో సహజీవనం చేస్తూ ఒక పాపకు జన్మనిచ్చాడని సీకే కేమ్ రిపోర్ట్ ఇచ్చాడు. ఈ తతంగానికి సురేషే ప్రోత్సాహకుడేనని నమ్మిన వెంకటయ్య, అతడి కుమార్తె ఉమా మహేశ్వరి ఇద్దరు బలంగా నిర్ణయించుకుని హత్య చేయించాలని నిర్ణయించారు. ఈ విషయంలో ఇరువురు కిరణ్ కుమార్ కు చెప్పగా అంధుకు తాను తాను గతంలో నేవీలో కమ్యూనికేషన్ వింగ్ లో పని చేసినానని, ఆధారాలు దొరక్కుండా హత్య ఏ విధంగా చేయాలో తెలుసని వెంకటయ్యకు చెప్పారు. దీంతో అంతా కుమ్మక్కై ముషం జగదీష్‌ను అనే వ్యక్తికి రూ.15లక్షలు ఇచ్చి రెక్కి నిర్వహించాలని కోరారు. అనుకున్న ప్రకారం ముందుగా రూ.2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. ఈ పథకంలో భాగంగా, చిక్కు కిరణ్ కుమార్ జగదీష్ కు మరో రూ.3లక్షలు ఇస్తానని ఆశచూపించాడు. దీంతో నెల రోజుల నుంచి నల్లగొండలో తిరుగుతూ గద్దపాటి సురేశ్ కదలికలపై రెక్కినిర్వహించారు.

పక్కాప్లాన్ ప్రకారమే..

ఈ నెల 11న సాయంత్రం కిరణ్ కుమార్ హైదరాబాద్‌లో హత్యకు కావాల్సిన చాకులు, మాస్కులు, టోపీలు, గ్లౌస్ లు సిద్ధం చేసుకుని కారులో బయలుదేరారు. నల్లగొండకు వచ్చే మార్గ మధ్యలో చెరువుగట్టు సమీపంలో, అప్పటికే వేచి చూస్తున్న జగదీష్‌తో కలిసిన తర్వాత, వారు ఇద్దరూ రాత్రి 10:20 గంటలకు నల్లగొండ రామగిరి సెంటర్ లో గల మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ వద్దకు చేరుకున్నారు. సురేష్ షాపు వద్దకు వచ్చి తమకు ఫొటోలు ప్రింట్ కావాలని అడుగగా.. రాత్రి అయిందని, రేపు ఉదయం రమ్మని అన్నాడు. అర్జెంట్ గా కావాలని కోరగా, సురేష్ ప్రింట్ వేయడానికి ఒప్పుకున్నాడు. పనిలో నిమగ్నం అయ్యి ఉండగా అదే ఆదునుగా భావించి అతనిపై కత్తులతో దాడి చేసి గొంతు కోసి, వీపు భాగంలో, కడుపులో విచక్షణా రహితంగా పొడిచి దారుణంగా హత్య చేశారు. హత్య అనంతరం వారు బైక్ పై చెరువుగట్టుకు వెళ్లి రక్తం అంటిన దుస్తులు, కత్తులు కారులో పెట్టుకుని ముసి వాగు సమీపంలో చెట్ల పొదలలో విసిరి, హైదరాబాద్ పారిపోయారు. నేరస్తులను బుధవారం అరెస్టు చేసి కోర్ట్ లో హాజరు పరచి, అటునుంచి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. నిందితులనుంచి మారుతి జెన్ కారు, రెండు బైకులు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును నల్లగొండ డీఎస్పీ కే.శివరాం రెడ్డి గారి ఆధ్వర్యంలో నల్లగొండ టూ టౌన్ సీఐ రాఘవరావు, శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి, నల్లగొండ 1 టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు వై.సైదులు, నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు, విష్ణుమూర్తి, సాయిప్రశాంత్ నాలుగు బృందాలుగా ఏర్పడి కేసును చేధించడంతో వారిని ఎస్పీ అభినందించినారు.



Next Story

Most Viewed