తెలంగాణలో ముస్లిం వ్యతిరేక ప్రభుత్వం: ఇంతియాజ్ ఫైర్

by Satheesh |
తెలంగాణలో ముస్లిం వ్యతిరేక ప్రభుత్వం: ఇంతియాజ్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మైనారిటీలకు ఎన్నికల్లో హామీలు అడ్డగోలుగా ఇచ్చారని, 4వేల కోట్లతో సబ్ ప్లాన్ పెడుతామని నాడు ఇచ్చిన ఏమైందని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో గురువారం బీఆర్ఎస్ నేతలు బైకాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీ దానిష్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అయినప్పటికీ మైనార్టీల సంక్షేమంపై ఒక్క సమీక్ష చేయలేదన్నారు. ఒక్క మైనారిటీకి పదవి ఇవ్వలేదని, మంత్రి పదవి లేదు.. ఒక్క ఎమ్మెల్సీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 100 శాతం సబ్సిడీ కింద లక్ష రూపాయలు, మహిళలకు కుట్టు మిషన్‌లు అందజేశారని తెలిపారు.

మైనారిటీ గురుకుల పాఠశాలలను ఎత్తివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని మైనారిటీ గురుకుల పాఠశాలలను ఎత్తేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. మైనారిటీ డిక్లరేషన్‌పై ఒక్క పథకం అమలు చేయలేదని మండిపడ్డారు. హజ్ యాత్రలో సైతం కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. రాష్ట్రంలో ముస్లిం వ్యతిరేక ప్రభుత్వం అధికారంలో ఉందని, అందుకే ముస్లింలకు రావాల్సిన నిధులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింలకు మైనారిటీ సబ్ ప్లాన్ యాక్ట్ ఎప్పుడు పెడుతున్నారో ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed