‘కీర్తి’ కోసం.. కబ్జా!

by Mahesh |
‘కీర్తి’ కోసం.. కబ్జా!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘లగ్జరీ విల్లాస్’ కు దారి కోసం వేణుగోపాల స్వామి ఆలయ భూమిపై కన్నేశారు. తెర వెనక ఓ బడా నేత చక్రం తిప్పి, కౌన్సిలర్లతో తీర్మానం చేయించారు. ప్రైవేటు ప్రాజెక్టుకు మేలు కలిగించేందుకు ఆలయ భూమిని కబ్జా చేశారు. దేవాదాయ శాఖ అధికారులకు తెలియకుండానే నార్సింగి మున్సిపల్ అధికారులు సిమెంటు రోడ్డు పనులు మొదలు పెట్టేశారు. ఆలయ ఈఓ సంప్రదిస్తే.. పనులు ఆపేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఎండోమెంట్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. కాగా, సంపన్నులు, ప్రముఖులు, రాజకీయ నేతలు విల్లాలు కొనుగోలు చేసిన ‘కీర్తి వెస్ట్ విండ్స్ ప్రాజెక్టు’ కోసం ఆలయ భూమిని కబ్జా చేస్తుండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవులలో వేణుగోపాల స్వామి ఆలయం పేరిట సర్వే నం.303లో 16.01 ఎకరాల స్థలం ఉన్నది. దశాబ్దాలుగా దేవాదాయ శాఖ దీన్ని కాపాడుతూ వస్తున్నది. అయితే శుక్రవారం ఆ స్థలంలో ఎవరో రోడ్డు వేస్తునారని ఆలయ ఈఓ నరేందర్ కు సమాచారమందింది. దీంతో ఆయన మున్సిపల్ ఆఫీసుకు వెళ్తే.. తామే ఆ రోడ్డు వేస్తున్నామని అధికారులు సమాధానమిచ్చారు.

అది దేవాదాయ శాఖ భూమి అని, రోడ్డెలా వేస్తున్నారని అడిగితే, మున్సిపాలిటీలో తీర్మానం చేశామని స్పష్టం చేశారు. ఆలయ అధికారులను ఎవరూ సంప్రదించలేదని, రోడ్డు పనులను ఆపివేయాలని కోరగా, ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని నార్సింగి కమిషనర్ సత్యబాబు సమాధానమిచ్చారని ఆలయ ఈఓ నరేందర్ ‘దిశ’కు తెలిపారు. అనంతరం ఈఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

‘కీర్తి’ కోసమేనా!

కీర్తి వెస్ట్ విండ్స్ లగ్జరీ విల్లాస్ కోసమే మున్సిపల్ యంత్రాంగం ఈ రోడ్డు వేస్తున్నదనే అనుమానం వ్యక్తమవుతున్నది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్టులో సంపన్నులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు విల్లాలు కొనుగోలు చేశారు. ఆ విల్లాలకు మరింత సౌలభ్యంగా ఉండేందుకే ఓ బడా నేత చక్రం తిప్పినట్లు తెలుస్తున్నది. మున్సిపల్ కౌన్సిలర్లతో తీర్మానం చేయించి, అధికారికంగా, ప్రజాధనంతో సిమెంటు రోడ్డు వేయిస్తున్నారనే విమర్శలున్నాయి.

దారి లేకుండా అనుమతులెలా?

అనుమతులు పొందేందుకు కీర్తి వెస్ట్ విండ్స్ ప్రాజెక్టు దారి ఎక్కడి నుంచి చూపించిందో తెలియడం లేదు. దేవాదాయ శాఖ స్థలాన్ని చూపించి, హెచ్ఎండీఏ పర్మిషన్లు పొందిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. అందుకే ఆగమేఘాల మీద సిమెంట్ రోడ్డు వేయించుకునేందుకు వ్యూహరచన చేసిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి రోడ్డు వేస్తారు? ఎవరి స్థలమది? అనే కోణంలో విచారించకుండానే అప్రూవల్ ఇచ్చారా? అన్ని తెలిసే జారీ చేశారా? అన్న విషయాలు స్పష్టం కావాల్సి ఉంది. అయితే విల్లాస్ కొనుగోలు చేసిన వారంతా పలుకుబడి, ఆర్థిక బలం ఉన్నోళ్లు కావడంతో అవన్నీ అటకెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

మున్సిపల్ కమిషనర్ నో రెస్పాన్స్

వేణుగోపాల స్వామి ఆలయ భూమిలో సిమెంట్ రోడ్డు వేస్తుండడంతో నార్సింగి మున్సిపల్ కమిషనర్ సత్యబాబును సంప్రదించేందుకు ‘దిశ’ ప్రయత్నించింది. రోడ్డు వేస్తున్నది కీర్తి విల్లాస్ కోసమేనా అని వివరణ అడిగేందుకు ట్రై చేసింది. అయితే దీనిపై కమిషనర్ రెస్పాండ్ అవ్వలేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు.

Advertisement

Next Story

Most Viewed