Harish Rao : పొరుగు రాష్ట్రం మన నీటిని తరలిస్తుంటే రేవంత్ చోద్యం చూస్తున్నారు : హరీష్ రావు

by M.Rajitha |
Harish Rao : పొరుగు రాష్ట్రం మన నీటిని తరలిస్తుంటే రేవంత్ చోద్యం చూస్తున్నారు : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana) నీటి ప్రయోజనాలకు ఆంధ్రప్రదేశ్(AP) ప్రభుత్వం గండి కొడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుండడం దుర్మార్గం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) మండిపడ్డారు. కృష్ణా జలాలను ఏపీ అడ్డూ అదుపూ లేకుండా తరలించుకు పోతుంటే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttham kumar Reddy) ఏం చేస్తున్నారు? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలలుగా నాగార్జునసాగర్(Nagarjuna Sager) కుడి కాలువ నుంచి రోజుకు 10వేల క్యూసెక్కులను ఏపీ తరలించుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? అని ప్రశ్నించారు. అదే విధంగా ఏడాది మొత్తంలో 646 టీఎంసీలు తరలిస్తే ఎందుకు నోరు మెదపడం లేదని, తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్ కు పట్టవా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.

సాగర్ ఆనకట్ట కేంద్ర బలగాల ఆధీనంలో ఉందని, వారి పర్యవేక్షణలో మాత్రమే నీటిని విడుదల చేసుకోవాల్సి ఉన్నప్పటికీ ఏపీ మాత్రం ఇష్టారాజ్యంగా నీటిని తరలిస్తోందన్నారు. తెలంగాణ తాగునీటి అవసరాలకు శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో నిలువ ఉంచాల్సిన కోటాను ఏపీ తీసుకెళ్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదన్నారు. శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో మిగులు నిల్వలు లేకున్నా పోతిరెడ్డిపాడు, సాగర్ కుడి కాల్వ ద్వారా ఇప్పటికే ఏపీ నీటిని తరలిస్తూ మొండిగా వ్యవహరిస్తుందని తెలిపారు. ప్రతీ సంవత్సరం ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించి నీటి వినియోగానికి కేఆర్ఎంబీ పరిధిలోని త్రిమెన్ కమిటీ సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది ఇంతవరకు త్రిమెన్ కమిటీ మీటింగ్ పెట్టలేదుని, అంటే బోర్డు వ్యవహారం ఎంతగా దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం బోర్డుపై ఒత్తిడి చేయడంలో, నీటి తరలింపు చేయకుండా ఏపీని నిలువరించడంలో తద్వారా తెలంగాణ నీటి హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ సర్కారు ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ఏపీ దూకుడు, తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్య వల్ల ఇప్పటికే నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు ఖాళీ అయ్యాయని, మరోవైపు వేసవి పూర్తిగా మొదలు కాకమునుపే తెలంగాణ రైతులు నీళ్ళ కోసం రోడ్డెక్కి ధర్నాలు చేసే కాలం వచ్చిందన్నారు. ఏపీ నీటి తరలింపును ఇప్పటికైనా అడ్డుకోకపోతే సాగర్ ఆయకట్టుకు ప్రమాదం ఏర్పడనుందన్నారు. సాగర్ లో నీటిమట్టం పడిపోతే హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య సైతం ఏర్పడుతుందని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ఏపీ నీటి దోపిడిని అడ్డుకోవాలని, ఈమేరకు కృష్ణ బోర్డుపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు.



Next Story

Most Viewed