TG: ఆరేండ్ల సమస్యకు పరిష్కారం.. తొమ్మిది లక్షల కుటుంబాలకు లభించనున్న ఊరట

by Gantepaka Srikanth |
TG: ఆరేండ్ల సమస్యకు పరిష్కారం.. తొమ్మిది లక్షల కుటుంబాలకు లభించనున్న ఊరట
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూభారతి చట్టం అమలైతే ఆరేండ్లుగా పెండింగులో ఉన్న సాదా బైనామా సమస్యకు పరిష్కారం లభించనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల కుటుంబాలకు ఊరట కలగనుంది. మెనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ‘సాదాబైనామా’కు సొల్యూషన్ చూపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఓ వైపు విధి విధానాలు ఖరారు చేస్తూనే.. ఈ నెలాఖరు వరకు కొత్త ఆర్వోఆర్ చట్టం అమల్లోకి రాగానే ఈ దరఖాస్తులను పరిశీలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. గ్రామ పాలనాధికారుల ద్వారా ప్రాథమిక విచారణ చేయించి, ఆ తర్వాత ఆర్డీవో స్థాయిలో వీటికి పరిష్కారాలు వెతకనున్నారు. ఆర్వోఆర్-2025లో కేవలం పెండింగులో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి ప్రొవిజన్ ఉండేలా, భవిష్యత్తులో సాదాబైనామాల ప్రక్రియను ఎంకరేజ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే గతంలో దాఖలైన దరఖాస్తుల వరకే ఈ ప్రొవిజన్ వర్తించనుంది.

పాత చట్టంలో పరిష్కార మార్గాలు లేకనే..

2020 అక్టోబర్‌లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 112 ద్వారా సాదాబైనామాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులను స్వీకరించింది. 2020 అక్టోబర్ 10 నుంచి 29 తేదీ వరకు 2,26,693 దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత ఆర్వోఆర్-2020 అమల్లోకి వచ్చింది. అందులో అప్పటి వరకు అమల్లో ఉన్న సెక్షన్ 5 ఏ, 5 బీ సెక్షన్లను తొలగించారు. దీంతో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం లేకుండా పోయింది. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 6,74,201 అప్లికేషన్లు వచ్చాయి. అంటే మొత్తంగా తొమ్మిది లక్షల వరకు అప్లికేషన్లు వచ్చాయి. ధరణి చట్టంలో ఆ ప్రొవిజన్ లేకుండానే అప్లికేషన్లు ఎలా స్వీకరించారని, వాటిని ఏ చట్ట ప్రకారం పరిష్కరిస్తారని కోర్టులో కేసులు దాఖలయ్యాయి. దాంతో అప్లికేషన్లు పరిష్కరించకుండా స్టే విధించారు. ఆ స్టేను వేకెట్ చేయించేందుకు ఏ ప్రయత్నమూ జరగలేదు. పాత చట్టంలో సవరణలూ చేయలేదు. దీంతో ఇంత కాలం అపరిష్కృతంగా మిగిలాయి. ఇప్పుడు అలాంటి సమస్య తలెత్తకుండా ఆర్వోఆర్-2025లో పెండింగ్ దరఖాస్తుల వరకు ప్రొవిజన్ కల్పించారు.

రెండు సెక్షన్లు తొలగించడంతో..

ఆర్వోఆర్-1971 అమల్లోకి వచ్చినప్పుడు సాదాబైనామాలకు అవకాశం ఇవ్వొద్దని డిసైడ్ చేశారు. సేల్ డీడ్స్ ద్వారానే లావాదేవీలు జరగాలని నిర్ణయించారు. అప్పట్లో మ్యుటేషన్ చేయకపోతే 90 శాతం మందికి పట్టాలివ్వలేమని అధికారులు లెక్క తేల్చారు. భాగ పంపకాలు, నోటి మాట, తెల్ల కాగితాల ద్వారా కొనుగోళ్లు తెలంగాణలో సాధారణమని కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు. దాని ఫలితంగానే ఆర్వోఆర్ యాక్ట్-1971లో 5 ఏ, 5 బీ సెక్షన్లు తర్వాత అమెండ్‌మెంట్ చేశారు. 5ఏ ద్వారా అన్ రిజిస్టర్ డాక్యుమెంట్ల రెగ్యులరైజేషన్, వాటిపై 5బీ కింద ఆర్డీవోకు అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు నిర్దేశించారు. ఈ రెండు సెక్షన్లు 1989లో చేర్చడం గమనార్హం. దాంతో 1971–1989 మధ్య కాలంలో ప్రభుత్వం భూమి ఎలా సంక్రమించినా.. అది వాస్తవమైతే రికార్డుల్లోకి ఎక్కించాలని నిర్ణయించారు. ఆర్వోఆర్-1971 యాక్టులో రూల్ పొజిషన్‌లో తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటే విచారించారు. స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చేవారు. ఆ ఆర్డర్ కాపీ విలువైనదిగా మారింది. అయితే ఆర్వోఆర్-2020లో ఈ రెండు సెక్షన్లను తొలగించారు. ఆ చట్టంలో పెండింగ్ దరఖాస్తుల వరకు ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఇప్పుడీ సమస్య తలెత్తేది కాదు.

నో ఇష్యూ..

సాదాబైనామాల దరఖాస్తులపై కోర్టులో కేసు ఉందని, స్టే ఆర్డర్ ఉన్నప్పుడు ఎలా పరిష్కరిస్తారంటూ కొందరు వాదిస్తున్నారు. అయితే చట్టంలో ఎలాంటి ప్రొవిజన్ లేనప్పుడు ఎలా పరిష్కరిస్తారన్న అంశంపైనే ఆ కేసు ఉన్నది. ఇప్పుడా అవకాశం కొత్త చట్టంలో కల్పిస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదని రెవెన్యూ నిపుణులు అంటున్నారు. స్టే వెకేట్ చేసిన తర్వాతే మొదలు పెట్టాలన్న అవసరం సైతం లేదంటున్నారు. దానికి తోడు 2020 అక్టోబర్ 29 వరకు దాఖలైన 2.26 లక్షల దరఖాస్తుల పరిష్కారం ఎప్పుడైనా చేసే వీలున్నది. దానిపై ఎలాంటి పేచీ లేదని గుర్తు చేస్తున్నారు. దీనిపై అనవసర రాద్ధాంతం చేయడం వల్ల దరఖాస్తుదారుల సహనాన్ని పరీక్షించడమేనంటున్నారు. ఇప్పటికే ఐదారేండ్లుగా భూ హక్కుల కోసం నిరీక్షిస్తున్నారు. వారి అప్లికేషన్లకు ఏదో ఒక రిప్లయ్ రాకపోతే ఇబ్బంది పడతారన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

Next Story

Most Viewed