ఒకే ఫ్యామిలీకి 3 టికెట్లిస్తే 30 ఏళ్ల నుంచి ఉన్న మా సంగతేంది?.. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థిపై తీవ్ర వ్యతిరేకత

by Prasad Jukanti |   ( Updated:2024-03-27 11:25:01.0  )
ఒకే ఫ్యామిలీకి 3 టికెట్లిస్తే 30 ఏళ్ల నుంచి ఉన్న మా సంగతేంది?.. పెద్దపల్లి కాంగ్రెస్  అభ్యర్థిపై తీవ్ర వ్యతిరేకత
X

దిశ, డైనమిక్ బ్యూరో: పెద్దపల్లి కాంగ్రెస్‌లో అసమ్మతి మంటలు రాజుకున్నాయి. టికెట్ విషయంలో అధిష్టానం పునరాలోచన చేయాలని నేతలు హెచ్చరిస్తున్నారు. ఒకే కుటుంబానికి, ముగ్గురు పారాచూట్ లీడర్లకు ప్రయార్టీ ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. పెద్దపల్లి ఎంపీ టికెట్ గడ్డం వంశీకి ఇవ్వడంపై ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ మాజీ కార్యదర్శి ఊట్ల వరప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలు పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఆశావహులు ఒక్కొక్కరుగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుండటంతో పెద్దపల్లి టికెట్ రచ్చ కాంగ్రెస్ పెద్దలకు మరో తలనొప్పి వ్యవహారంగా మారిందనే టాక్ వినిపిస్తోంది.

టికెట్ వచ్చుడో.. సచ్చుడో..

పెద్దపల్లిలో నిన్న వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. మూడు నెలల ముందు పార్టీలోకి వచ్చిన వివేక్ కుటుంబానికి 3 టికెట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. 30ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నవారు, కష్టకాలంలో అండగా నిలబడినవారి సంగతి ఏంటన్నారు. పెద్దపల్లి టికెట్ విషయంలో పార్టీ పెద్దలు పునరాలోచన చేయాలని కోరారు. స్థానికులకే ఇవ్వాలనే డిమాండ్‌తో పెద్దపల్లి టికెట్ వచ్చుడో.. వరప్రసాద్ సచ్చుడో నినాదంతో ఏప్రిల్ 5న జిల్లా కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్లు స్పష్టం చేశారు.

మార్చకుంటే ఎదురుదెబ్బే!

గడ్డం వినోద్ కుమార్‌కు బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉండగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్‌కు వచ్చిన వివేక్‌కు అవకాశం ఇవ్వడంతోపాటు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని, కానీ ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా అదే కుటుంబానికి ఇవ్వడం ఏంటని నేతలు నిలదీస్తున్నారు. మూడు తరాలుగా గడ్డం ఫ్యామిలీదే ఆధిపత్యం నడుస్తోందని, గడ్డం వెంకటస్వామితోపాటు ఆయన కుమారులు వినోద్, వివేక్‌లకు అవకాశం ఇవ్వగా ఇప్పుడు మూడోతరానికి చెందిన వంశీకి సైతం చాన్స్ కల్పించడంపై భగ్గుమంటున్నారు. తాత నుంచి మనవడి వరకు వీళ్ల ఫ్యామిలీ కోసం పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు జెండాలు మోయాల్సిందేనా అని నిలదీస్తున్నారు. తన అవసరాల కోసం పార్టీలు మారే వివేక్ కుటుంబానికి ఎంపీ టికెట్ ఇవ్వడం విషయంలో పునరాలోచన చేయకుంటే పార్టీకి ఎదురుదెబ్బ తప్పదనే చర్చ జోరందుకుంది.

Advertisement

Next Story

Most Viewed