నేనే రంగంలోకి దిగుతా.. వలసలపై కేటీఆర్ హాట్ కామెంట్స్

by Prasad Jukanti |
నేనే రంగంలోకి దిగుతా.. వలసలపై కేటీఆర్ హాట్  కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో : పార్టీని వీడి వెళ్తున్నవారు రాళ్లు వేసి వెళ్లడం కామన్ అని వాళ్లు చేస్తున్న విమర్శలు వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.కే.కేశవరావు, కడియం శ్రీహరి బీఆర్ఎస్‌ను వీడటంపై స్పందిస్తూ పిలిచి పదవులిస్తే ఇన్నాళ్లు అనుభవించి, పార్టీ కష్టకాలంలో ఉండగా వదిలి వెళ్తున్నారని మండిపడ్డారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో జరిగిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ నాయకులు పార్టీని వదిలేసి వెళ్లినా పార్టీ కార్యకర్తల కోసం తానే స్వయంగా పని చేస్తానని, మీ వద్దకు వస్తానని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించుకుంటా అని భరోసా ఇచ్చారు.

కాళ్లు పట్టుకున్నా చేర్చుకోం..

రంజిత్ రెడ్డి, మహోందర్ రెడ్డిలు పార్టీకి ద్రోహం చేశారని, కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయిన రోజే రంజిత్ రెడ్డి నవ్వుకుంటూ కాంగ్రెస్‌లోకి పోయారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం తనకు ఫోన్ చేసిన మొట్టమొదటి వ్యక్తి రంజిత్ రెడ్డి అని, ఈసారి అడ్వాన్స్‌గా ఉండాలని చెప్పి చేవెళ్ల అభ్యర్థిగా ప్రకటింపచేసుకుని పార్టీ మారారన్నారు. పార్టీ మారక ముందు వారిద్దరు పార్టీని మారడం లేదంటూ ఆస్కార్‌ను మించిన ఫర్మార్మెన్స్ ఇచ్చారన్నారు. వారి విషయంలో పార్టీ కార్యకర్తలు ఓట్ల రూపంలో పగ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వీరిద్దరు మళ్లీ చేరుతామని కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా బీఆర్ఎస్‌లో చేర్చుకోబోమన్నారు.

ఆరు గారడీలు మిగిలినయి..

మల్కాజిగిరిలో పోటీ చేద్దామన్న తన చాలెంజ్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం లేదని, సిట్టింగ్ స్థానంలోనే పోటీకి వెనుకంజ వేసిన ఆయన రాష్ట్రంలో ఉన్న మిగతా ఎంపీ సీట్లను గెలిపిస్తానని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి లీకుల వీరుడిగా మారి ఎన్నికల హామీలపై ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఆరు గ్యారంటీలు పోయి ఆరు గారడీలు మిగిలాయని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గం సంతోషంగా లేదన్నారు. ‘రేవంత్ రెడ్డి.. ఐదేళ్లు ప్రభుత్వంలో ఉండు. నీ 420 హామీలు నెరవేర్చు. నీకు నల్లగొండ, ఖమ్మం నాయకులే మానవబాంబులైతరు’ అని హెచ్చరించారు. తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతుక కేసీఆర్ అని, మన నాయకుడిని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed