సర్వే నెంబర్ 25లోనే మై హోం విహంగ : ఎమ్మెల్సీ బలమూర్ వెంకట్

by Sumithra |
సర్వే నెంబర్ 25లోనే మై హోం విహంగ : ఎమ్మెల్సీ బలమూర్ వెంకట్
X

దిశ, శేరిలింగంపల్లి : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు లేని ప్రేమను నటిస్తున్నాయని, విద్యార్థులను కావాలనే రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నాయని, హెచ్సీయూ భూములను మై హోం సంస్థకు ఏ ప్రాతిపదికన కట్టబెట్టారని ప్రశ్నించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. మంగళవారం గచ్చిబౌలి మై హోం విహంగ వద్ద ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, విద్యార్థి నాయకులు ఆందోళన నిర్వహించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ కంచే గచ్చిబౌలిలో సర్వే 25లో 2004 లో 534 ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తున్నట్టు హెచ్ సీయూ రిజిస్ట్రార్ సంతకం చేశారని, బదులుగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 397 ఎకరాలను హెచ్ సీయూకు ఇచ్చిందని తెలిపారు. 534 ఎకరాలలో 400 ఐఎంజీ భారత్ కు 120 ఎకరాలు టీఎన్జీవో ఉద్యోగ సంఘాలకు, ఇతరులకు కేటాయించారని అన్నారు. ఐఎంజీ భారత్ ఒప్పందం ప్రకారం వ్యవహరించలేదని, అందుకే భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళకుండా ప్రభుత్వం న్యాయ పోరాటం చేసిందన్నారు.

సుప్రీం కోర్టు 400 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానివే అని స్పష్టం చేసిందని, ఆ భూములు ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వానివే అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే సర్వే నంబర్ 25లోని 25 ఎకరాల భూములను మై హోం విహంగ ప్రాజెక్ట్ కోసం రామేశ్వర్ రావుకు కట్టబెట్టారని, బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు డబ్బుల మూటలు అందుకుని నోర్లు మెదపలేదని, ఇప్పుడు హెచ్సీయూ భూముల పై లేని ప్రేమను ఒలకబోస్తూ, విద్యార్థులను రెచ్చగొడుతున్నారని అన్నారు. మై హోం విహంగ పేరున ఇక్కడ పెద్ద భవనాలు నిర్మించారు. రెండు భవనాలకే వంద ఫీట్ల రోడ్డు వేశారన్న ఆయన అవన్నీ ప్రభుత్వ నిధులేనని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఉద్యోగ సంఘాలకు కేటాయించిన భూమిలో మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుడు పేర్లతో 20 ఎకరాలు ఆక్రమించే ప్రయత్నం చేశారని, ఆ 20 ఎకరాలు ప్రభుత్వం గుంజుకుంటుందన్న భయంతో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నాడని అన్నారు. ప్రభుత్వ భూమిలో నిర్మించిన మై హోం నిర్మాణాల వద్దకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటి ఎందుకు రావడం లేదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. పర్యావరణం దెబ్బతింటుందని, మై హోం విహంగకు 25 ఎకరాలు ఇచ్చినప్పుడు కేటీఆర్ కు హెచ్సీయూ భూములు కనిపించలేదా అన్నారు. లోపాయికారీ ఒప్పందాలు లేకపోతే మై హోం నిర్మాణం చేస్తున్నప్పుడు ఎందుకు స్పందించలేదన్నారు. వ్యక్తిగత స్వార్థం కోసమే ప్రభుత్వ భూమిని మై హోం కు కట్టబెట్టిందని ఎమ్మెల్సీ బల్మూరి విమర్శించారు.

Next Story

Most Viewed