పేదల జీవితాలంటే తమాషాగా ఉందా ! కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి...

by Sumithra |
పేదల జీవితాలంటే తమాషాగా ఉందా ! కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి...
X

దిశ, కార్వాన్ : పేదోడి ఇల్లు కూల్చాలనుకుంటే బాధిత ప్రజల పక్షాన బీజేపీ నిలుస్తుందని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం మూసీ పరివాహక ప్రాంతాల్లో రాందేవ్ గూడా, లంగర్ హౌస్, జియాగూడ పర్యటించి బాధితులకు నేనున్నానంటూ పేదలకు భరోసా ఇచ్చారు. పేదలకు వారి హక్కులు అందేవరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో ప్రజల ఇండ్లకు మార్కింగ్ చేస్తూ ఇండ్లు కూల్చివేస్తామంటూ రేవంత్ ప్రభుత్వం ప్రకటిస్తున్నదని, కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో అనేక సంవత్సరాలుగా మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసముంటున్న పేదప్రజలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. లక్షా 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తామంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముందు పేదల ఇండ్లు కూల్చకుండా మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు.

పేదవాడి ఇల్లు కూల్చి ఆ స్థలంలో సుందరీకరణ చేస్తామనుకుంటే బీజేపీ సహించదని, బాధిత ప్రజల పక్షాన మేం నిలబడతామని భరోసా ఇచ్చారు. బస్తీల్లో డ్రైనేజీ వ్యవస్థను నిర్మించడం, ఆధునీకరించడం, రోడ్ల నిర్మాణం, ప్రజలకు ఆధార్, రేషన్ కార్డులు ఇప్పించడంతో పాటు అనేక మౌలిక సదుపాయాలు కల్పించేలా బీజేపీ అండగా ఉంటున్నదని అన్నారు.

ఇక్కడి ప్రజలెవ్వరూ తమకు ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరలేదని కాని, రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల కూల్చివేతలకు పాల్పడుతోందని అన్నారు. ఏండ్లకేండ్లు కాయాకష్టం చేసి ఇటుక, ఇటుక పేర్చి ఇండ్లు కట్టుకుంటే... ఇప్పుడు ఆ పేదల ఇండ్లను కూల్చుతామనడం అన్యాయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రి బుల్డోజర్లతో ఇండ్లు కూల్చానుకోవడం ఏమాత్రం సరికాదని హెచ్చరించారు. ప్రాణాలకు తెగించైనా పేదల ఇండ్ల కూల్చివేతలను మేం అడ్డుకుంటాం అని భరోసా ఇచ్చారు. పేద ప్రజలను ఈ ప్రాంతం నుంచి వేరుచేస్తామంటే ఊరుకునేది లేదని అన్నారు.

గతంలో కేసీఆర్ మూసీనదిని కొబ్బరినీళ్లతో నింపుతామని ప్రకటించి, అడ్రస్ లేకుండా పోయారని, నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ పేరుతో ఇండ్లు కూల్చివేయాలని ప్రయత్నిస్తున్నాడని తెలిపారు.

ప్రభుత్వమే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, జీహెచ్ఎంసీ మొత్తం హైదరాబాద్ లో షామీర్ పేట, కుత్బుల్లాపూర్ నుంచి మొదలు డ్రైనేజీ వాటర్ ను మూసీలో కలుపుతున్నాయిని, డ్రైనేజీ మళ్లింపు, డైవర్షన్ లేకుండా లక్షల కోట్లు ఖర్చుపెట్టినా మూసీ సుందరీకరణ సాధ్యం కాదని అన్నారు. ముందుగా ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని, పైపులైన్లు నిర్మించి, ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలిని తెలిపారు. మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ ను నిర్మించి, ఆ తర్వాత మూసీ సుందరీకరణ చేయండి అని ప్రభుత్వానికి సూచన ఇచ్చారు. పేదవాడి ఇండ్లు కూల్చాలనుకుంటే బాధిత ప్రజల పక్షాన బీజేపీ నిలుస్తుందిని హెచ్చరించారు. ముందు మాపై బుల్డోజర్లు తీసుకొచ్చి.. అప్పుడు పేదల ఇండ్ల కూల్చివేయండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తుందని పేర్కొన్నారు. పోరాటానికి మనందరం సిద్ధం కావాలని చెప్పారు. ఉమారాణి, గోవర్ధన్, పూర్ణచందర్రావు ఇంద్రసేనారెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed