- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎన్నికలప్పుడే గుర్తుకొచ్చిందా: తమిళనాడు సీఎంపై కిషన్ రెడ్డి ఫైర్

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో మూడు భాషల ఫార్ములా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే రూపుదిద్దుకుందని, దేశంలో హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలని మోడీ ప్రభుత్వం ఎప్పుడు ఒత్తిడి చేయలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కొత్త విద్యా విధానం తీసుకొచ్చేందుకు తమిళనాడుకు చెందిన కస్తూరి రంగన్ నేతృత్వం వహించారని, ఆయన సూచనల మేరకే 2022లో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త విద్యా విధానం తీసుకొచ్చిందని తెలిపారు. శనివారం ఆయన ఓ మీడియా కాంక్లేవ్కార్యక్రమంలో మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల తరువాత తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కొత్త ఎడ్యుకేషన్ పాలసీ గుర్తుకొచ్చిందని, ఎన్నికలు వస్తుండటంతో ఆయనకు ఎక్కడ లేని సమస్యలు ఆయనకు గుర్తొస్తాయని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లలో తమిళనాడులో ఏం జరిగిందో అందరికీ తెలుసునని అవినీతి, లిక్కర్ స్కామ్ నుంచి తమిళనాడు ప్రజలను పక్కదారి పట్టించేందుకు స్టాలిన్ కొత్త నాటకాలకు తెరలేపారని మండిపడ్డారు. ప్రధాని మోడీ ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి భాషతోనే ఆయన ప్రసంగం ప్రారంభిస్తారని ప్రాంతీయ భాషలకు ఎంతో గౌరవం ఇస్తారని గుర్తు చేశారు. ఉన్నత పాఠశాల విద్య వరకు మాతృభాషలోనే చదువుకోవాలని కొత్త విద్యా విధానం చెబుతోందని, తమిళనాడు నుంచి ఆలిండియా సర్వీసులకు ఎవరైనా ఎంపికై ఉత్తరప్రదేశ్ లో పనిచేయాల్సి వస్తే ఎలా పని చేస్తారని ప్రశ్నించారు. హిందీ నేర్చుకుంటే ఉత్తరాదిలో పనిచేయడం సులభమని, తమిళనాడు డీఎంకే నేతల పిల్లలందరూ ఢిల్లీలో, ఉత్తరాదిన చదువుకుంటున్నారని డీఎంకే నేతలు నిర్వహించే విద్యాసంస్థల్లో హిందీ బోధన ఉందన్నారు.
వ్యాపారాల కోసం హిందీ అవసరం, రాజకీయాల వచ్చేసరికి అవసరం లేదు
తమిళనాడులో సీబీఎస్ఈ సహా ప్రైవేట్ విద్యాసంస్థల్లో హిందీ బోధన జరుగుతుందని, వ్యాపారాలు చేసుకునేందుకు హిందీ అవసరం కానీ రాజకీయాల వచ్చే సరికి హిందీ వద్దా అంటూ నిలదీశారు. ఆరాష్ట్ర ప్రజల్లో హిందీ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని, రాజకీయాల కోసమే డిఎంకె నేతలు, కాంగ్రెస్ నాయకులు ఈ నాటకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు తెలంగాణ, కర్ణాటకలో ఎన్నికలు జరిగితే బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఇటీవల తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ రెండు సీట్లు గెలుచుకుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నుంచే 60 శాతం ఆదాయం వస్తోంది. అలాంటప్పుడు హైదరాబాద్‌ను వదిలి ఆదిలాబాద్‌లో ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నిస్తే ఎలా ఉంటుందన్నారు. దేశంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. దేశాభివృద్ధి కోసం వివిధ ప్రాంతాల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కొన్ని పార్టీలు రాష్ట్రాల్లో గ్యారంటీల పేరుతో ఇష్టానుసారంగా హామీలు ఇస్తున్నారని విమర్శించారు. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదికాదని, ఇతర పార్టీలు ఇచ్చిన గ్యారంటీలకు కేంద్రం ఎందుకు నిధులు ఇస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వంద శాతం తప్పకుండా అమలు చేస్తున్నామన్నారు. బీజేపీలో ప్రజాస్వామ్యం ఉంటుందని, కేసీఆర్ తర్వాత ఆపార్టీలో అధ్యక్షుడు ఎవరో చెప్పవచ్చని, బీజేపీలో అలా కాదు. జేపీ నడ్డా తర్వాత అధ్యక్షుడు ఎవరో ఆ దేవుడు కూడా చెప్పలేడన్నారు. బీజేపీ అధికారంలోకి రాకపోతే, మోడీ ప్రధాని కాకుంటే ఆర్టికల్ 370 రద్దు సాధ్యపడేది కాదని, రామజన్మభూమి ఆలయ నిర్మాణం జరిగి ఉండేది కాదన్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్రలు, సీమాంతర ఉగ్రవాద దాడులు కొనసాగుతూ ఉండేవి. బీజేపీకి అన్ని పార్టీలు భయపడుతున్నాయని రాజకీయంగా ఎదుర్కోలేక కొన్ని పార్టీలు ఏకమవుతున్నాయని మండిపడ్డారు. వారసత్వ పార్టీలన్నీ ప్రైవేటు కంపెనీలుగా మారి డబ్బులు దండుకోవడమే పనిగా పనిచేస్తున్నాయి. గతంలో డబ్బులు తెచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి ఇచ్చిన వారికే గనుల కేటాయింపులు జరిగేవి. ప్రస్తుతం పూర్తి పారదర్శకంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేలం ప్రక్రియ ద్వారా గనుల కేటాయింపు జరుగుతోందని స్పష్టం చేశారు.