Swarnalata : భవిష్యవాణి పలికిన స్వర్ణలత.. ఏం చెప్పారో తెలుసా..

by Sumithra |
Swarnalata : భవిష్యవాణి పలికిన స్వర్ణలత.. ఏం చెప్పారో తెలుసా..
X

దిశ, బేగంపేట : ఈ ఏడాది పూజలు సంతోషంగా ఆనందంగా అందుకున్నాను. ఎవరికి ఏ ఆటంకం లేకుండా నేను చూసుకుంటానని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో భవిష్యవాణి స్వర్ణలత తెలిపారు. ఏ బోనం అయినా, ఎవరు ఎతుకొచ్చినా పర్వాలేదు. సంతోషంగా అందుకునేది నేనే, వాళ్ళు వీళ్ళే తేవాలని సందేహం పెట్టుకోకండి అని ఆమె తెలిపారు. ఎవరు తెచ్చినా సంతోషంగా అందుకునే బాధ్యత నాది అన్నారు. సకాలంలో కోరినంత వర్షాలు పడతాయని పాడిపంటలు సమగ్ర అభివృద్ధి చెందుతాయని ఆమె వివరించారు. ఎటువంటి లోటు లేదు మీకు, మీరు ఆనందంగా, సంతోషంగా ఉండండి అని రంగం భవిష్యవాణి స్వర్ణలత తెలిపారు.

అలాగే అనుమానాలు పెట్టుకోకండి.. నన్ను నమ్ముకున్న వారిని కాపాడుకుంటాను అన్నారు. తన దర్శనం చేసుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాలి. లేదంటే సోమరి పోతులు అవుతారని ఆమె అన్నారు. పిల్లలు, పెద్దలు, జంతువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని వెల్లడించారు. నా రూపం పెట్టాలి అనుకుంటున్నారు కదా.. పెట్టండి. ఎవరు ఏం చేసినా, ఎవరెంత అడ్డుపడినా నా రూపం నేను శాశ్వతంగా పెట్టించుకుంటాను. తప్పని సరిగా నా రూపాన్ని నేను నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. పంటలు గతంలో లాగా పండించడం లేదు. మందులు ఎక్కువ వాడుతున్నారు. అందుకే అనారోగ్యం, వాటిని తగ్గించుకుంటే మీకు వ్యాధులు తగ్గుతాయని అన్నారు. సంతోషంగా ఘనంగా పూజలు అందుకున్నాను. పిల్లలకు, గర్భిణులకు ఏం ఇబ్బంది రానివ్వను. అందరినీ సంతోషంగా ఆనందంగా వుండేలా చూసుకుంటాను భవిష్యవాణిలో స్వర్ణలత వెల్లడించారు.



Next Story