‘ఒక్క ఛాన్స్ ఇవ్వండి’.. కేసీఆర్‌కు BRS నేత సంతోష్ గుప్తా కీలక విజ్ఞప్తి

by Sridhar Babu |   ( Updated:2024-03-23 13:37:46.0  )
‘ఒక్క ఛాన్స్ ఇవ్వండి’.. కేసీఆర్‌కు BRS నేత సంతోష్ గుప్తా కీలక విజ్ఞప్తి
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఉప సభాపతి , ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో గత కొన్ని రోజులుగా ఇక్కడి అభ్యర్థి ఎవరనే విషయంలో ఏర్పడిన సస్పెన్స్ కు తెరదించినట్లైంది. 2019 లో లోక్ సభకు జరిగిన ఎన్నికలలో సికింద్రాబాద్ నుండి పోటీ చేసిన తలసాని సాయికుమార్ యాదవ్ ఈ పర్యాయం ముందుకు రాకపోవడంతో పద్మారావుగౌడ్ ఎంపిక అనివార్యమైంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల వ్యవధిలోనే బీఆర్ఎస్ పార్టీ ఢీలా పడింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే

దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ దక్కించుకోగా మరికొంత మంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ నుండి పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ పేరు దాదాపు ఖరారైందని గత మూడు, నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేశాయి. పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఆయననే బరిలోకి దించాలని నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పద్మారావు గౌడ్ ఉపసభాపతిగా పని చేసిన విషయం తెలిసిందే.

పెండింగ్ లో హైదరాబాద్..

రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నియోజకవర్గాన్ని మాత్రం పెండింగ్ లో పెట్టింది. గత పదేళ్లుగా ఎంఐఎంతో స్నేహ పూర్వక పోటీకి మాత్రమే అభ్యర్థులను బరిలోకి దించిన బీఆర్ఎస్ పార్టీ ఈ పర్యాయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ

ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కూడా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ప్రకటన విషయంలో జరుగుతున్న జాప్యానికి ఎంఐఎం పార్టీనే కారణమని గుసగుసలు వినబడుతున్నాయి. ఓవైసీ నుండి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అభ్యర్థికే బీఆర్ఎస్ టికెట్ దక్కుతుందనే ప్రచారం ఇంకా నడుస్తోంది.

ఒక్క అవకాశం ఇవ్వండి.. సంతోష్ గుప్తా..

గన్ ఫౌండ్రి డివిజన్ మాజీ కార్పొరేటర్ మమతా గుప్తా భర్త సంతోష్ గుప్తా తనకు హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి ఉద్యమకారునిగా కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడని, సతీమణి మమతా గుప్తా గన్ ఫౌండ్రి డివిజన్ కార్పొరేటర్ గా పని చేసిందని తెలిపారు .

గోషామహల్ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి తాను ఎంతగానో కృషి చేశానని అన్నారు. పాతబస్తీలోని అన్ని నియోజకవర్గాలలో తనకు వ్యాపార, వాణిజ్య వర్గాల పరిచయాలు ఉన్నాయని తెలిపారు. తనకు టికెట్ ఇవ్వడం వల్ల వైశ్య సామాజిక వర్గం ఓట్లు కూడా పెద్ద ఎత్తున పార్టీకి పడే అవకాశం ఉందని ఒక్క అవకాశం ఇవ్వాలని సంతోష్ గుప్తా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed