- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రసవత్తరంగా శేరిలింగంపల్లి రాజకీయం..!
దిశ, శేరిలింగంపల్లి: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అన్ని పార్టీల్లోనూ ఆశావాహులు ఇప్పటి నుండే ప్రణాళికలు రచిస్తున్నారు. ఎవరు ఎక్కడి నుండి పోటీ చేయాలి, ఏ నియోజకవర్గంలో అనుకూలంగా ఉంటుంది, ఎక్కడ ప్రతికూలంగా ఉంటుంది అన్నదానిపై ఇప్పటి నుండే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో శేరిలింగంపల్లి నియోజకవర్గం హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఇక్కడ ప్రస్తుతం బీఆర్ఎస్ కు చెందిన అరేకపూడి గాంధీ ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్ గా కొనసాగుతున్నారు. ఈ సారి ఎన్నికల్లోనూ అధికార బీఆర్ఎస్ నుండి ఆయనకే టికెట్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే మిగతా పార్టీల నుండి కూడా ఈసారి పాత కొత్త నాయకులు బరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడి నుండి ఈ నియోజకవర్గ నాయకులే కాదు పక్క నియోజకవర్గ ప్రతినిధులు కూడా బరిలో ఉండేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో టీడీపీ నుండి పోటీ చేసే నాయకుడు మరో నియోజకవర్గం నుండి ఇక్కడికి దిగుమతి అవుతున్నారని సమాచారం.
శేరిలింగంపల్లిలో అంతా ఆయనే..
రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం అయిన శేరిలింగంపల్లిపై అన్ని పార్టీలు గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. ఈ సారి ఇక్కడి నుండి ఎలాగైనా గెలవాలని తహతలాడుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే అరేకపూడి గాంధీకి ఇక్కడ ఎదురులేని పరిస్థితి. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయనకు నియోజకవర్గంపై మంచి పట్టుందనే చెప్పాలి. కొందరు కార్పొరేటర్లతో ఎమ్మెల్యే గాంధీకి సఖ్యత లేదని, వారు దూరంగా ఉంటున్నారనే ప్రతిపక్షాలు, ఇతర నాయకులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ ఇటీవల నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో అందరినీ కలుపుకుపోయి ముందుకు వెళుతున్నారు. అలాగే అభివృద్ధి విషయంలోనూ కోట్లాది రూపాయలతో కాలనీల వారిగా పనులు చేపడుతున్నారు. వేలాదిగా పింఛన్లు, ఆహార భద్రత కార్డులు, ఇతర పథకాలతో ప్రజలకు మరింత దగ్గర అవుతున్నారు. ఈసారి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ టికెట్ గాంధీకే అని ఆయన అనుచరులే కాదు ఆపార్టీ కార్యకర్తలు కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. శేరిలింగంపల్లి బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తారని ఒకరిద్దరి పేర్లు వినిపించినా గాంధీ మినహా ప్రస్తుతానికి బీఆర్ఎస్ టికెట్ ఆశావాహులు ఎవరూ లేరనే చెప్పాలి.
టీడీపీ అభ్యర్థిగా కూన వెంకటేష్ గౌడ్..!?
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ తర్వాత అత్యధిక ఓటర్లు ఉన్నది తెలుగుదేశం పార్టీకే అన్నది ఆపార్టీ నాయకులు చెబుతున్న మాట. రాష్ట్ర విభజన తర్వాత కూడా శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి బరిలో నిలిచారు. ఆయన రెండవ స్థానంలో నిలువడమే కాదు, దాదాపు లక్షల వరకు ఓట్లు సాధించారు. ఈసారి కూడా శేరిలింగంపల్లి నుండి టీడీపీ అభ్యర్థి బరిలో ఉండనున్నారు. అయితే పాత క్యాండెట్ కాకుండా ఈసారి సనత్ నగర్ నియోజకవర్గానికి చెందిన కూన వెంకటేష్ గౌడ్ లేదా ఆయన కుమారుడు గౌరీ శంకర్ గౌడ్ శేరిలింగంపల్లి నుండి పోటీలో ఉండనున్నట్లు పక్కా సమాచారం. అందులో భాగంగానే ఈనెల 26న కూన వెంకటేష్ గౌడ్ టీడీపీలో చేరనున్నారు. శేరిలింగంపల్లి టికెట్ హామీతోనే ఆయన టీడీపీలో చేరుతున్నారని, ఆయనకు శేరిలింగంపల్లి లోకల్ లీడర్ల నుండి కూడా మద్దతు లభిస్తుందని, ఇప్పటికే కొంతమంది లోకల్ లీడర్లతో కూన టచ్ లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే కూన వెంకటేష్ గౌడ్ తో పాటు మొవ్వా సత్యనారాయణ కూడా ఈసారి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటారన్న టాక్ నడుస్తుంది. ఇటీవలే బీజేపీలో చేరిన మొవ్వాకు శేరిలింగంపల్లి టికెట్ ఇస్తున్నారని, మొవ్వాకు టికెట్ ఇప్పించేందుకు సుజనా చౌదరీ, సీఎం రమేష్, ఓ ఛానల్ కు చెందిన ప్రముఖ వ్యక్తి, మరో ఇద్దరు నాయకులు టీడీపీ టికెట్ వచ్చేలా ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది.
కాంగ్రెస్ నుండి ఇద్దరు.. బీజేపీ నుండి ఇద్దరు
కాంగ్రెస్ పార్టీ నుండి సత్యనారాయణ, జెరిపేటి జైపాల్ లు బరిలో ఉన్నారు. అయితే ఇద్దరూ కూడా శేరిలింగంపల్లి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ జోడోయాత్ర కోసం జెరిపేటి జైపాల్ లక్షల రూపాయలు వెచ్చించారు. అటు సత్యనారాయణ కూడా పీసీసీ పెద్దలతో తీవ్రంగా టికెట్ కోసం మంతనాలు సాగిస్తున్నారు. ఇక బీజేపీ నుండి మాజీ ఎమ్మెల్యే కుమారుడు, మారబోయిన రవికుమార్ యాదవ్ బీజేపీ టికెట్ తనకే పక్కా అనే ధీమాతో ఉన్నారు. ఇప్పటికే డివిజన్ ల వారిగా పాదయాత్ర చేస్తూ ప్రజలకు దగ్గర అవుతున్నారు. అదే బీజేపీ నుండి గజ్జల యోగానంద్ మరోసారి బరిలో ఉంటాడని ప్రచారం చేసుకున్నా ఈ మధ్య ఆయన కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది. ఇక మిగతా పార్టీలు అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఉలుకూపలుకు లేకుండా స్థబ్దుగా ఉన్నాయి.