మెగా డీఎస్సీపై నిరుద్యోగుల్లో ఆశలు.. కొత్త ప్రభుత్వం నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ

by Sathputhe Rajesh |
మెగా డీఎస్సీపై నిరుద్యోగుల్లో ఆశలు.. కొత్త ప్రభుత్వం నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో మెగా డీఎస్సీపై నిరుద్యోగులు ఆశలు పెంచుకున్నారు. గత ప్రభుత్వం 13వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి, కేవలం 5089 పోస్టులకు మాత్రమే టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులు పెంచాలని అభ్యర్థులు ఆందోళనలు చేసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. నవంబరు 20 నుండి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పింది. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమలు కావడంతో ఆ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. అంతలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, పార్టీ మేనిఫెస్టోలో మెగా డీఎస్సీ హామీ ఇవ్వడంతో అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.

పోస్టులు పెంచుతారా?

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని పార్టీ తన ఎన్నికల మెనిఫెస్టోలో పేర్కొన్నది. పాత టీఆర్టీ నోటిఫికేషన్ కు సంబంధించి పరీక్షల తేదీలు ఇంకా ఖరారు చేయనందున.. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ కోసం నోటిఫికేషన్ వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త వారికీ అప్లయ్ చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అయితే త్వరలో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

మెగా డీఎస్సీ నిర్వహించాలి

గత ప్రభుత్వం కేవలం 5089 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ వేసింది. అయితే ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ జత చేసి మెగా డీఎస్సీ కోసం ప్రభుత్వం రీ నోటిఫికేషన్ జారీ చేయాలి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాలి. 4 లక్షల మంది డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ కు అండగా నిలిచామనే విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలి.

- రావుల రామ్మోహన్ రెడ్డి, తెలంగాణ డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు

Advertisement

Next Story