ఆఖరి నిమిషంలో హరీష్ రావు పర్యటన రద్దు.. కారణమదేనా?

by Sathputhe Rajesh |
ఆఖరి నిమిషంలో హరీష్ రావు పర్యటన రద్దు.. కారణమదేనా?
X

దిశ, ప్రతినిధి నిర్మల్: రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన ఆఖరు క్షణంలో రద్దయింది. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పర్యటన ఖరారైంది. ఉదయం 9 గంటలకే నిర్మల్ చేరుకొని స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సిటి స్కానింగ్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించాల్సి ఉంది.

ఆ తర్వాత నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించి ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గానికి ఆయన వెళ్లే షెడ్యూల్ ఉంది. అక్కడ 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన బహిరంగ సభ కార్యక్రమాల్లో పాల్గొన వలసి ఉండగా... ఆఖరి క్షణంలో ఆయన పర్యటన రద్దయింది.

సీఎం పిలుపుతో..

మంగళవారం రాత్రి సిద్దిపేటలో బసచేసిన మంత్రి హరీష్ రావు నేరుగా రోడ్డు మార్గం గుండా అక్కడి నుంచి నిర్మల్‌కు రావాల్సి ఉంది. అయితే సీఎం కేసీఆర్ పిలిచారని ఆయన సిద్ధిపేట నుంచి నేరుగా హైదరాబాద్ ప్రగతి భవన్‌కు వెళ్లారు. అక్కడి కార్యక్రమాలు ముగిసిన వెంటనే హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి నిర్మల్‌కు వస్తారని అధికార యంత్రాంగానికి సమాచారం అందింది.

దీంతో అధికారులు ఆగమేఘాల మీద స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియం వద్ద అలాగే మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతున్న చోట హెలిపాడ్లు ఏర్పాటు చేశారు.బోథ్ నియోజకవర్గంలోను అక్కడి అధికారులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు భారీ ఏర్పాట్లు చేశారు.

ఆఖరి క్షణంలో ఆయన పర్యటన రద్దు కావడం చర్చనీయాంశం అయింది. సీఎం పిలుపు మేరకు ఆయన కార్యక్రమం అంతా గజిబిజిగా మారడం వల్లనే నిర్మల్ పర్యటన రద్దు చేసుకున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే హరీష్ రావు నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల పర్యటన వాయిదా పడడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

మంత్రి హరీష్ రావు పర్యటన రద్దు కావడంతో నిర్మల్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన సిటీ స్కాన్ యంత్రాన్ని జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అయితే మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో 11 కులాలను ఎస్టీల్లో చేర్చాలని చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని నిరసిస్తూ ఆదివాసీ సంఘాలు తుడుం దెబ్బ నేతృత్వంలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా హరీష్ పర్యటనకు భారీగా పోలీసులను మోహరించారు. చివర్లో హరీష్ పర్యటన రద్దు వెనక ఈ అంశం కూడా ఉండవచ్చని భావిస్తున్నారు

Advertisement

Next Story

Most Viewed