Harish Rao: చాయ్ తాగినంత సేపట్లో సమస్య తీరుస్తామన్నారు.. హరీశ్ రావు ఆసక్తికర పోస్ట్

by Ramesh N |
Harish Rao: చాయ్ తాగినంత సేపట్లో సమస్య తీరుస్తామన్నారు.. హరీశ్ రావు ఆసక్తికర పోస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ (Samagra Shiksha Abhiyan) ఉద్యోగుల సమస్యలు తీరుస్తామని, వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి, ఏడాది గడిచినా ఉలుకు లేదు, పలుకు లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను పోలీసుస్టేషన్ తరలించి, నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల టెంట్ల ముందు నుంచే వెళ్తున్న ముఖ్యమంత్రి గారు.. టెంట్లు పీకేయడం కాదు, వారి సమస్యకు పరిష్కారం చూపండని విమర్శించారు. 15రోజులుగా ఆందోళన చేస్తున్న వారి ఆవేదన అర్థం చేసుకోండని సూచించారు.

అన్ని వర్గాలను మోసం చేస్తున్న విధంగానే సమగ్ర శిక్ష ఉద్యోగులను కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు. రోడ్డెక్కి నిలదీస్తే అక్రమ నిర్బందాలకు గురిచేస్తున్నారని, ఇది హేయమైన చర్యగా అభివర్ణించారు. నిర్బంధించిన సమగ్ర శిక్ష ఉద్యోగులను తక్షణం విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా రెగ్యులరైజేషన్ సహా ఇతర హామీలను నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed