పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

by GSrikanth |
పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట సెంట్రల్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ అంబేద్కర్ ఏర్పాటుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ పెద్దల అనుమతితో ఇక్కడ ఏప్రిల్ 14న విగ్రహావిష్కరణ చేయబోతున్నారు. ఈ మేరకు ఈ స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ శనివారం పరిశీలించారు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు ఇక్కడ విగ్రహం ఏర్పాటు కోసం ప్రత్యేకంగా పోరాటం చేస్తున్నారు. ఇటీవల ఇక్కడ విగ్రహం ఏర్పాటు విషయంలో చర్చ సైలెంట్ అవుతున్న దశలో అనూహ్యంగా ప్రభుత్వం విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వడం, ఏప్రిల్ 14నే ప్రారంభోత్సవం ఉంటుందని అనౌన్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఆ విమర్శల డైవర్షన్ కోసమేనా?

ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త సచివాలయం ప్రారంభోత్సవం విషయంలో గత కొంత కాలంగా ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో నిర్మిస్తున్న ఈ సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరి 17న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఇది రాచరిక వ్యవస్థ కాదని కేసీఆర్ పుట్టిన రోజున ప్రారంభించడం ఏంటని నిలదీశాయి. ఇంతలో అక్కడ అగ్నిప్రమాదం సంభవించడం, ఇతర కారణాలతో ప్రారంభోత్సవం వాయిదా పడింది. తర్వాత ప్రారంభోత్సవ తేదీ ఎప్పుడు అనేది ప్రభుత్వం ప్రకటించలేదు. జూన్ 2వ తేదీలోపు ఓపెనింగ్ ఉంటుందనే సంకేతాలను ఇచ్చింది. అయితే సచివాలయం ప్రారంభోత్సవం ఏప్రిల్ 14న చేపట్టకపోతే ఆవర్గాల నుంచి విమర్శలు వస్తాయని అంచనాతో ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు పంజాగుట్ట విగ్రహం విషయంలోనూ ప్రభుత్వం తీవ్ర విమర్శలు మూటగట్టుకుంటోంది. ఈ విమర్శలన్నింటికి చెక్ పెట్టేలా పంజాగుట్ట సర్కిల్ లో ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇచ్చిందనే చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed