రైతులకు గుడ్ న్యూస్.. రూ.2 లక్షల రుణమాఫీపై సర్కారు కీలక ప్రకటన

by Disha Web Desk 4 |
రైతులకు గుడ్ న్యూస్..  రూ.2 లక్షల రుణమాఫీపై సర్కారు కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్/ తెలంగాణ బ్యూరో :ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకు రూ. 2 లక్షల వరకున్న రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం పేర్కొన్నారు. తొందర్లోనే విధివిధానాలను రూపొందిస్తామన్నారు. ఒకేసారి రెండు లక్షలనూ మాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నందున రిజర్వు బ్యాంకు, సంబంధిత బ్యాంకులతో కలిసి విధివిధానాల రూపకల్పనకు కసరత్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఒకేసారి చెల్లించడానికి భారీ స్థాయిలో నిధులు అవసరమవుతున్నందున ప్రభుత్వానికి భారంగా మారుతుందని, దీన్ని అధిగమించడానికి ఆర్బీఐ, కమర్షియల్ బ్యాంకుల ద్వారా రైతులకు ఒకేసారి చెల్లించి ప్రభుత్వం మాత్రం ఆ బ్యాంకులకు వాయిదాల్లో రీఇంబర్స్ చేయడంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మంత్రులు గతంలోనే ప్రకటించారు.

గత ప్రభుత్వం రైతు రుణమాఫీ స్కీమ్‌ను ఒకేసారి కాకుండా నాలుగేండ్లలో నాలుగు విడతల్లో అమలుచేసినందువల్ల రైతులకు ప్రయోజనం లేకుండా పోయిందని మంత్రి ఆ ప్రకటనలో గుర్తుచేశారు. తొలి టర్ములో నాలుగు వాయిదాల్లో చెల్లించినా సెకండ్ టర్ములో (2018-23 మధ్య) మాత్రం రెండు వాయిదాలకే సరిపెట్టిందని, దీంతో రైతులకు రూ. 50 వేల రుణం వరకు మాత్రమే మాఫీ అయిందని మంత్రి తుమ్మల ఆ ప్రకటనలో గుర్తుచేశారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా రుణమాఫీతో రైతులను గత ప్రభుత్వం మభ్యపెట్టిందన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఔటర్ రింగు రోడ్డు టోల్ గేట్‌ను 30 ఏండ్ల పాటు లీజుకు ఇచ్చి దాని ద్వారా వచ్చిన డబ్బును రుణమాఫీకి వినియోగించిందన్నారు.

సగం మంది రైతులకు మాత్రమే రుణమాఫీని అమలు చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం తప్పుపడుతూ రైతుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నదన్నారు. రాష్ట్రంలోని వర్షాభావ, దుర్భిక్ష పరిస్థితులను కూడా రాజకీయానికి వాడుకుంటున్న బీఆర్ఎస్‌ నేతల కామెంట్లను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. వాస్తవానికి గత ప్రభుత్వం రైతులకు వడగండ్ల వానలతో పంటలను నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించలేదని, కానీ ఇప్పటి ప్రభుత్వం మాత్రం ఎకరానికి రూ. 10 వేలను అందించడానికి కసరత్తు మొదలుపెట్టిందన్నారు. లబ్ధిదారుల వివరాలను సేకరించాల్సిందిగా వ్యవసాయ శాఖకు అప్పగించామన్నారు.


Next Story

Most Viewed