- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వార్డు ఆఫీసర్ పాలనపై జీహెచ్ఎంసీ కసరత్తు.. కార్పొరేటర్ల సీరియస్
దిశ, సిటీ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో త్వరలోనే వార్డు ఆఫీసర్ల పాలన రానుంది. వీలైనంత త్వరగా వార్డు ఆఫీసర్ల పాలన తీసుకువచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని మహానగరాల్లో కొనసాగుతున్న వార్డు ఆఫీసర్ల పాలనపై ఇటీవలే జీహెచ్ఎంసీకి చెందిన అధికారుల బృందం అధ్యయనం చేసిన సంగతి తెలిసిందే. గ్రేటర్ పరిధిలోని 150 వార్డుల్లో వీలైనంత త్వరగా ఆఫీసులను ఏర్పాటు చేసేందుకు డివిజన్ల వారీగా స్థలాలను గుర్తించాలని ఇప్పటికే డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం.
మొత్తం 150 డివిజన్లలో వార్డుకో ఆఫీసు చొప్పున 150 ఆఫీసులకు 150 మంది వార్డు ఆఫీసర్లను నియమించనున్నట్లు తెలిసింది. ఇందులో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లున్న డివిజన్లలో తొలి దశగా ఆఫీసులను ఏర్పాటు చేయాలని మౌఖిక ఆదేశాలొచ్చినట్లు సమాచారం. రెండో దశగా మజ్లీస్ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లలో ఏర్పాటు చేసేలా ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇక ఇతర పార్టీల కార్పొరేటర్లున్న డివిజన్లలో వార్డు ఆఫీసుల ఏర్పాటు గురించి, తర్వాత ఆలోచించాలన్న పరిస్థితులు నెలకొన్నాయి.
ఒక్కో వార్డుకు మున్సిపల్ శాఖకు చెందిన అధికారిని వార్డు ఆఫీసర్లుగా నియమించి పాలన కొనసాగించాలని జీహెచ్ఎంసీ యోచిస్తుంది. ముఖ్యంగా ఒక్కో వార్డులో ప్రజలకు అతి ముఖ్యమైన, అత్యవసరమైన సేవలందించే వివిధ ముఖ్య శాఖల మధ్య సమన్వయం లేకపోవటంతో ప్రజాసమస్యల పరిష్కారం, అభివృద్దిలోనూ తీవ్రమైన జాప్యం జరుగుతున్నందున ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు వార్డు ఆఫీసర్ల పాలనను ప్రవేశపెట్టాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ఒక వార్డుకు సంబంధించి కార్పొరేటర్, ఎమ్మెల్యేల నిధుల నుంచి చేపట్టే అభివృద్ది పనులకు సంబంధించి కార్పొరేటర్ అధ్యక్షతన ఏర్పాటయ్యే వార్డు కమిటీ తీర్మానం చేసి పంపిన తర్వాత వార్డు ఆఫీసర్ కూడా దానికి ఆమోద ముద్ర వేసి సదరు స్థానిక సర్కిల్ డిప్యూటీ కమిషనర్లకు పంపి, మంజూరీ పొందేలా చూస్తారు.
సమన్వయం కుదిరేనా?
ఇప్పటికే డివిజన్ల వారీగా ఉన్న కార్పొరేటర్లలో కొందరు ఆ వార్డుకు వారే రాజులుగా ఫీలవుతున్నారన్న విమర్శలు లేకపోలేవు. ఇక వారితో కలిసి వార్డు ఆఫీసర్లు పని చేస్తారంటే ఇందుకు కార్పొరేటర్లు అంగీకరిస్తారా? అన్న అనుమానాల్లేకపోలేవ్. గతంలో వార్డు కమిటీలు ఏర్పాటు చేయటాన్ని జీర్ణించుకోలేని కార్పొరేటర్లు వార్డు కమిటీ సభ్యుల పదవీ కాలాన్ని ఏడాదికి, రెండేళ్లకే పరిమితం చేయాలన్న వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వార్డు ఆఫీసర్, వార్డు కమిటీ సభ్యులంటే తమ ఆధిపత్యం ఎక్కడ తగ్గిపోతుందోనని ఇప్పటి నుంచే వార్డు పరిపాలన వ్యవస్థను కొందరు కార్పొరేటర్లు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు వార్డు ఆఫీసర్, ఆయనకు కింది స్థాయి సిబ్బంది వల్ల అవినీతి పెరిగేందుకు కూడా ఆస్కారముంటుందని పలువురు కార్పొరేటర్లు వాదిస్తున్నారు.