Liquor Ban: గాంధీజీకి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన గట్టికల్లు

by Bhoopathi Nagaiah |
Liquor Ban: గాంధీజీకి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన గట్టికల్లు
X

దిశ, వెబ్‌డెస్క్ : పేరుకు తగ్గట్టే ఆ ఊరు గట్టి ప్రయత్నమే చేసింది. దశాబ్దాల క్రితం ఫ్యాక్షన్ గ్రామంగా దడ పుట్టించిన ఈ ఊరు నేడు సమస్యాత్మక విలేజ్‌గా పోలీసుల రికార్డుల్లో ఉంది. అయినా గాంధీ జయంతి రోజు ఆ గ్రామమంతా ఒక్కతాటిపైకి వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు, కుల, యువజన సంఘాలు చేయి చేయి కలిపి అడుగులో అడుగు వేశాయి. లిక్కర్ బ్యాన్ అంటూ ముక్తకంఠంతో నినదించి సంపూర్ణ మద్యపాన నిషేధానికి కంకణబద్దమయ్యారు. అంతేనా.. గుట్కా, పాన్ పరాగ్‌లను గ్రామం నుంచి తరిమేసి మహాత్మాగాంధీకి బర్త్ డే గిఫ్ట్‌గా అందించారు. ఈ రోజుల్లో ఇంతటి ఐక్యత ఉన్న గ్రామం ఏదా.. అని ఆలోచిస్తున్నారా..? అదే గట్టికల్లు గ్రామం.

సూర్యాపేట జిల్లా, ఆత్మకూర్ (ఎస్) మండలంలో ఉందీ గట్టికల్లు గ్రామం. గతంలో రాయలసీమ ఫ్యాక్షన్‌కు ఏమాత్రం తీసిపోని గ్రామం ఇది. రాజకీయ కక్ష్యలు, కార్పణ్యాలతో ఎప్పుడూ నివురుగప్పిన నిప్పులా ఉద్రిక్తతంగా ఉండేది. వ్యవసాయమే జీవనాధారం అయిన ఈ గ్రామంలో క్రమంగా మార్పు వచ్చింది. రాజకీయ పార్టీల మధ్య అధిపత్య పోరు ఉన్నా ఐక్యమత్యంలో మాత్రం ఏ మాత్రం తీసిపోరు. నాటి రజకార్లపై పోరాటంలో, మొన్నటి మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ గట్టికల్లు గ్రామస్తుల పోరాటపటిమ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు నేటికీ మర్చిపోలేదు. రజాకార్లను, పోలీసులను తరిమికొట్టిన ఘనచరిత్ర గట్టికల్లు సొంతం. అదే స్ఫూర్తి, పటిమతో నేడు మద్యపాన నిషేదానికి నడుం బిగించారు.

దశాబ్దాలుగా గ్రామాన్ని పట్టి పీడిస్తున్న మద్యం మహమ్మారిని గాంధీ జయంతి రోజు అంతమొందించారు. బుధవారం ఉదయం గ్రామంలోని అన్ని రాజకీయ, కుల, యువజన, మహిళా సంఘాలు, యువకులు, ప్రజలు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశం అయ్యారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆత్మకూర్ (ఎస్) ఎస్ఐ సైదులు సమక్షంలో గ్రామస్తులంతా కలిసి కీలక తీర్మానం చేశారు. గట్టికల్లు గ్రామంలో నిర్వహిస్తున్న బెల్టు షాపులను స్వచ్ఛందంగా బంద్ చేయాలని, కిరాణా షాపుల్లో గుట్కాలు, అంబర్లు అమ్మకూడదని, బహిరంగ ప్రదేశాల్లో, చర్చి, మసీదు, దేవాలయ ప్రాంగణాల్లో, వ్యవసాయ భూములు, కాలువలు, రోడ్లపై మద్యం సేవించరాదని తీర్మానించారు. గ్రామ నిబంధనలు అతిక్రమించి బెల్టు షాపులు నిర్వహిస్తే 25 వేల రూపాయలు జరిమానా విధించాలని నిర్ణయించారు. అలాగే గ్రామంలో పై నిబంధనలు కఠినంగా అమలు చేయడానికి మద్యపాన నిషేధ అమలు సమన్వయ కమిటీలను నియమించారు.

గ్రామంలో వీరిదే కీలక భూమిక

గట్టికల్లు గ్రామంలోని వివిధ విభాగాలకు చెందిన 19 కమిటీలను నియమించారు. ఇందులో గిలకత్తుల ప్రవీణ్ కుమార్ (మార్గం యూత్), గుర్రాల రాంబాబు(అరుంధతి యూత్), గుండు రమేష్(Cpim గ్రామశాఖ), నీలం అశోక్ (గోల్డెన్ స్టార్ యూత్), కోన గోవర్ధన్ (సర్వోత్తమ్ యూత్), బయ్య లింగయ్య (BJP గ్రామశాఖ-సంకినేని), గుండు వెంకన్న, (జైభారత్- రాజకీయేతర దేశభక్తియుత విప్లవ వేదిక), భూపతి రాములు,(మండల ప్రెస్ క్లబ్), మడ్డి శ్రీకాంత్ (BRS యూత్, BRS సోషల్ మీడియా), మడ్డి విజయ్ (భగత్ సింగ్ యూత్), మాచర్ల డానియేలు (బీఎస్పీ పార్టీ), మడ్డి శ్రీను (పెద్ద) (BRS పార్టీ), మడ్డి హరీష్ (లెనిన్ యూత్ ), జాకటి సందీప్ ( చైతన్య జ్యోతి యూత్), కోన అయోధ్య రాములు (కాంగ్రెస్ పార్టీ), బయ్యా అబ్బయ్య (యాదవ సంఘం) గుండు సతీష్ (బంగారుగడ్డ యూత్), తవుడోజు మంజుల (సంఘ బంధం-1), గుండు పద్మ (సంఘ బంధం-2). వీరంతా గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని కఠినంగా అమలు చేయడంతోపాటు గుట్కాలను గ్రామంలోకి రాకుండా అడ్డుకోనున్నారు.

Advertisement

Next Story

Most Viewed