రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు జీవో విడుదల

by GSrikanth |
రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు జీవో విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు మంగళవారం మధ్యాహ్నం జీవో విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇవాళ మొత్తం రెండు పథకాలు అమలు చేయనున్న విషయం తెలిసిందే. రూ.500 లకే గ్యాస్ సిలిండర్‌తో పాటు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఫథకాన్ని కూడా ప్రారంభించనున్నారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే రెండు పథకాలు ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించారు. ఇక, 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంట్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఇవాళ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ఈ రెండు స్కీములను రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బహిరంగ సభలో ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభించేలా ఏర్పాట్లు చేసింది. అయితే, అనివార్య కారణాలతో ఆమె పర్యటన రద్దు కావడం వల్ల ఆమె ఈ పథకాలను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

Advertisement

Next Story