- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఫార్ములా – ఈ రేసు కేసులో దూకుడు పెంచనున్న ఏసీబీ

దిశ, తెలంగాణ బ్యూరో: ఏసీబీ ప్రాథమిక విచారణను అడ్డుకోలేమంటూ హైకోర్టు, సుప్రీంకోర్టులు తీర్పు ఇవ్వడంతో ఫార్ములా – ఈ రేసు కేసులో ఏసీబీ దూకుడు పెంచనున్నట్లు తెలుస్తున్నది. కోర్టుల్లో విచారణ ఉండడంతో ఇన్నాళ్లు ఆచితూచి వ్యవహరించిన ఏసీబీ.. ఇప్పుడు లైన్ క్లియర్ కావడంతో విచారణ వేగవంతం చేయనున్నది. నిందితులకు మరోసారి నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఏ1గా ఉన్న కేటీఆర్, ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అరవింద కుమార్, ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిల స్టేట్మెంట్ లను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. మరోసారి విడివిడిగా విచారించడమా? లేక ముగ్గురిని ఒకే సారి ఒకే వేదికపై విచారించడమా? అనే విషయంపై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు కావల్సిన ప్రాథమిక ప్రక్రియను పూర్తి చేశారు. ముగ్గురు వెల్లడించిన అంశాలను ఒక రికార్డుగా చేసి పూర్తిస్థాయిలో విచారించనున్నారు. ముఖ్యంగా అగ్రిమెంట్ జరిగిన విధివిధాలనాపై విచారించనున్నారు. హెచ్ఎండీఏ చెల్లింపులు జరిగిన విధానాలపై మరోసారి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఎవరూ చెల్లింపులు చేయమన్నారనే అంశం ప్రాథమికం కానున్నది. విదేశీ కరెన్సీ రూపంలో బదిలీ చేయాడాన్ని ఎలా సమర్థించారో వివరాలు కోరనుంది. ఈ విషయంలో విచారించేందుకు ముగ్గురికి ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.
కేటీఆర్ అరెస్ట్ పై ఉత్కంఠ?
గురువారం ఈడీ విచారణ అనంతరం కేటీఆర్ అరెస్ట్ పై ఏసీబీ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఈ విషయంపై ఏసీబీ అధికారులు సమీక్ష నిర్వహించారని సమాచారం. సుప్రీంకోర్టులో కేసు విచారణ నేపథ్యంలో 9వ తేదీన ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ ను పంపినట్లు అధికారులు చెబుతున్నారు. ఈడీ విచారణ అనంతరం ఏసీబీ అధికారుల యాక్షన్ పై బీఆర్ఎస్ లీగల్ టీం అప్రమత్తమైనట్లు తెలుస్తున్నది. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విత్ డ్రా చేసుకోవడంలో కూడా లీగల్ టీం నిర్ణయం మేరకు కేటీఆర్ నడుచుకున్నట్లుగా సమాచారం. ఏసీబీ విచారణకు లాయర్ సమక్షంలో మాత్రమే హజరవుతానంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించి, నామమాత్రపు అనుమతులతో లాయర్ ను వెంటపెట్టుకుని విచారణకు హజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో కేటీఆర్ కు కోర్టుల నుండి పరాభవం ఎదురవుతూనే ఉంది. కేటీఆర్ కోర్టును ఆశ్రయించిన ప్రతిసారి ఏసీబీ అధికారుల విచారణకు మరింత బలం చేకూరుతున్నది. ఈ క్రమంలో కేటీఆర్ అరెస్టు పై బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది. కేసు నుంచి బయటపడేందుకు అన్ని దారులు మూసుకుపోయాయా అనే సందిగ్ధత నెలకొన్నది.