- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వారిని మళ్లీ పార్టీ చేర్చుకోం.. తేల్చిచెప్పిన KCR

దిశ, తెలంగాణ బ్యూరో: ‘వాడు వీడు భిక్ష వేస్తే తాను సీఎం సీట్లో కూర్చోను. వచ్చే మూడేళ్లూ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో కొనసాగుతుంది. ప్రభుత్వాన్ని కూల్చే పిచ్చిపిచ్చి పనులు మేం చేయబోం’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్‌లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మధ్యలో వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పినా తాము ఆ పనికి ఒప్పుకోబోమని అన్నారు. అలా మధ్యలో తాము అధికారాన్ని తీసుకోబోమని అన్నారు. జనరల్ ఎన్నికల్లోనే తేల్చుకుంటామని.. మళ్లీ తామే బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటామని అన్నారు.
వారిని మళ్లీ చేర్చుకోం
పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకోమని కేసీఆర్ స్పష్టం చేశారు. పార్టీ నుంచి పోయిన వారు వస్తామంటే తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమకే చాలా మంది లీడర్లు ఉన్నారని.. వారికే అవకాశాలు ఇస్తామని చెప్పారు. కొత్త వారిని తయారుచేసుకుందామని అన్నారు. రాష్ట్రంలో పలు సీట్లకు ఉప ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ గెలుపొందడం ఖాయమన్నారు. అలాగే.. మనకు బీజేపీ, కాంగ్రెస్ ఎవరూ పోటీకాదన్నారు. కాంగ్రెస్ పాలనను అనుభవిస్తున్న ప్రజలు పదేళ్ల దాంక మళ్లీ దానికి ఓట్లు కూడా వేయరన్నారు. వ్యవసాయం, నీరు, కరెంటుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందుకే ప్రజలు ఎన్నికల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని.. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా.. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పీడ పోతుందా అని చూస్తున్నారని అన్నారు. మళ్లీ వారు బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని చెప్పారు.
మోడీకి గర్వం పెరిగింది
దేశంలో మూడో సారి ప్రధానిగా అధికారం చేపట్టిన మోడీకి బాగా గర్వం పెరిగిందని కేసీఆర్ అన్నారు. తనకు తానే మేధావిని అని అనుకుంటున్నారని.. చివరకు ఆర్ఎస్ఎస్ కంటే తానే గొప్ప అనే భావనతో ఉన్నారని కేసీఆర్ చెప్పారు. ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ సైతం గుర్తించిందని, ఆయన మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నదని అన్నారు. ఇటు దేశవ్యాప్తంగానూ మోడీపై వ్యతిరేకత వచ్చిందన్నారు. మోడీ అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారని చెప్పారు. ఇక దేశంలో, రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయినట్లేనని జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్ రావు, వాణి దేవి, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, బండారి లక్ష్మారెడ్డి, డి.సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్‌రెడ్డి, డా.మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, నాయకులు పటోళ్ల కార్తీక్ రెడ్డి, మన్నె గోవర్ధన్ రెడ్డి, జయసింహ, మన్నె క్రిశాంక్, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.