తప్పుతున్న కేసీఆర్ అంచనాలు

by Mahesh |
తప్పుతున్న కేసీఆర్ అంచనాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్‌కు ఏదీ కలిసొస్తలేదు. ఏది పట్టుకున్న అది రివర్స్ అవుతుంది. ఆయన వేసిన అంచనాలు తప్పుతున్నాయి. దేశంలో ఫ్రంట్ కోసం చేసిన ప్రయత్నాలు, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో గెలుపు కోసం వేసిన ప్లాన్‌లు అన్ని బెడిసికొట్టాయి. ఇందుకు కేసీఆర్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలే కారణమా? లేకుంటే ఎవరైనా కావాలని ఆయనను పక్కదారి పట్టిస్తున్నారా? అనేది ప్రస్తుతం పార్టీలో చర్చనీయాంశమైంది. ఏ ఎన్నికలు వచ్చినా ఘనవిజయం బీఆర్ఎస్‌దే అని చెప్పిన కేసీఆర్‌ వరుస పరాజయాలను మూటగట్టుకుంటున్నారు. పార్టీ అధినేతగా ఏడాదికాలంగా ఏ నిర్ణయం తీసుకున్న కలిసి వస్తలేదనేది స్పష్టమవుతుంది. టీఆర్ఎస్ పేరు మార్చడంతో పాటు ఫ్రంట్ ప్రయత్నాలు చేశారు. ఈ రెండిట్లో ఫెయిల్ అయ్యారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఒక్క సీటు సాధించలేకపోయారు.

కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ ఓడిపోయారు. ఇలా వరుస ఎన్నికల్లో ఓటమితో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అయితే.. అసెంబ్లీ, లోక్ సభ, కంటోన్మెంట్ ఉప ఎన్నిక.. దేనిలోనూ ఆ నియోజకవర్గ నేతలను సంప్రదించకుండానే, సర్వేలు, ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టులు కాదని అనుకున్న వ్యక్తులకే టికెట్లు ఇవ్వడంతో ఘోర ఓటమి పలువురు పేర్కొంటున్నారు. నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నప్పటికీ తిరిగి వారికే టికెట్లు ఇవ్వడం, కేడర్-నేతల మధ్య ఉన్న గ్యాప్‌ను పూడ్చకపోవడం, కనీసం పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోకపోవడం, కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలే పార్టీకి ప్రస్తుతం గడ్డుకాలం నెలకొందని నేతలు మనసులోని మాటను చెబుతున్నారు. ఉద్యమకారులను, పార్టీకోసం పనిచేసే నికార్సైన కార్యకర్తలను, నేతలను గుర్తించకపోతే అసెంబ్లీ, పార్లమెంట్‌లో వచ్చిన ఫలితాలే వస్తాయని పలువురు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story