భారీ వర్షాల ఎఫెక్ట్.. 117 గ్రామాల‌కు రాక‌పోక‌లు బంద్.. జలదిగ్భందంలో గ్రామాలు

by M.Rajitha |
భారీ వర్షాల ఎఫెక్ట్.. 117 గ్రామాల‌కు రాక‌పోక‌లు బంద్.. జలదిగ్భందంలో గ్రామాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : భారీ వ‌ర్షాల కార‌ణంగా వాగులు, వంక‌లు పొంగి పొర్లుతుండ‌టంతో తెలంగాణ లోని ప‌లు గ్రామాల‌కు సంబంధాలు తెగిపోయాయి. ఆయా గ్రామాల‌కు వెళ్ళే ర‌హ‌దారులు కొట్టుకుపోవ‌డంతో రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ఇప్పటి వ‌ర‌కు అందిన ప్రాథ‌మిక స‌మాచారం మేర‌కు 117 గ్రామాల‌కు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన‌ట్లు పంచాయతీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఆయా గ్రామ‌ల‌కు వెల్లే రహాదారులు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. అత్యధికంగా ఉమ్మడి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో 33 గ్రామాలకు వెల్లే ర‌హ‌దారులు దెబ్బతిన‌గా, క‌రీంన‌గ‌ర్లో 20 గ్రామాల రోడ్లు పాడ‌య్యాయి. 20 గ్రామాల‌కు సంబంధాలు క‌ట్ అయ్యాయి. మ‌హ‌బూబ్ బాద్ లో 30 గ్రామాలు, ఉమ్మడి మెద‌క్ లో 8 గ్రామాల‌కు, నిజామాబాద్ లో 7 గ్రామాలకు, న‌ల్గొండ లో 4 గ్రామాల‌కు వెళ్ళే ర‌హ‌దారులు కొట్టుకు పోయాయి. ఇప్పటి వ‌ర‌కు క్షేత్రస్థాయిలో అందిన స‌మాచారం మేర‌కు మొత్తం 117 గ్రామాల‌కు రాక‌పోక‌లు పూర్తిగా నిలిచిపోయాయి. చాలా గ్రామాలు నీట మున‌గ‌డంతో గ్రామాల్లో ఇంట‌ర్నల్ రోడ్ల డామెజ్ ను అధికారులు అంచ‌నా వేయ‌లేక‌పోయారు. వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్టిన త‌ర్వాత దెబ్బతిన్న గ్రామీణ రోడ్లపై స్పష్టత వ‌స్తుంద‌ని రూర‌ల్ ఇంజ‌నీరింగ్ అధికారులు తెలిపారు. అయితే యుద్ద ప్రాతిప‌దిక‌న గ్రామీణ ర‌హ‌దారుల పునురుద్దర‌ణ ప‌నుల‌ను చేప‌ట్టాల‌ని పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీత‌క్క అధికారుల‌ను ఆదేశించారు. వ‌ర్షం త‌గ్గిన త‌ర్వాత అంచ‌నాలు సిద్దం చేసి దెబ్బతిన్న గ్రామాల మ‌ర‌మ‌త్తులు చేప‌ట్టాల‌ని ఆదేశాలు జారిచేసారు. వీలైనంత త్వర‌గా తాత్కాలిక ప్రాతిప‌దిక‌నైనా గ్రామీణ ర‌హ‌దారుల మ‌ర‌మ్మత్తులు చేప‌ట్టి.. పున‌రుద్దర‌ణ ప‌నుల‌ను పూర్తి చేస్తామ‌ని పంచాయతీరాజ్‌ శాఖ ఇంజినీరింగ్‌ విభాగం ఈఎన్సీగా కనకరత్నం తెలిపారు. వ‌ర్షం త‌గ్గు ముఖం ప‌ట్టగానే ప‌నులు ప్రారంభిస్తామ‌ని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed